ఎన్టీఆర్ విగ్రహానికి వెయ్యి కోట్లు ఖర్చు చేస్తున్నారట..! ..అని ప్రచారం ప్రారంభించడమే కాదు.. ” ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రం చేసే పనియేనా ఇది..?” అంటూ చెలరేగిపోవడం ప్రారంభించారు కొందరు. అర్థసత్యాలు, అసత్యాలు, మిడిమిడి జ్ఞానంతో రాస్తున్నారో.. లేక పోతే.. ప్రభుత్వంపై ఏదో విధంగా.. అభాండాలు వేసి… తమకు ఇష్టం లేని నేతపై బురద జల్లడం ద్వారా అభిమానించే పార్టీకి లాభం చేకూరుద్దామని అనుకుంటున్నారో కానీ…ఈ ప్రచారాన్ని ఓ స్థాయిలోనే చేస్తున్నారు. అమరావతిలో నిర్మించ దలచిన ఎన్టీఆర్ విగ్రహాన్ని… గుజరాత్లో పెట్టిన పటేల్ విగ్రహంతో పోల్చి…ఓ ధనిక రాష్ట్రం .. కట్టుకుంది. పేద రాష్ట్రం మనకెందుకు అంటున్నారు..?. నిజానికి ఏ విధంగా చూసినా.. పటేల్ విగ్రహం విషయంలోనూ… ఎన్టీఆర్ విగ్రహం పోలిక కాదు. ఎత్తు, ఖర్చు మాత్రమే కాదు.. ప్రజాధనం దుర్వినియోగం విషయంలోనూ.. పోలిక రాదు..!
ఎన్టీఆర్ విగ్రహానికి వెయ్యి కోట్లు ఖర్చవుతుందా..?
అమరావతికి సమీపంలో నీరుకొండ దగ్గర ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని పెట్టాలని ప్రభుత్వ నిర్ణయించింది. ప్రాజెక్ట్ కోసం దాదాపు 406కోట్లు ఖర్చవుతుందనేది డీపీఆర్ రిపోర్ట్. విగ్రహానికి 155 కోట్లు ఖర్చవుతుంది. చుట్టూ ఆడిటోరియం,సెల్ఫీ పాయింట్, ఫెర్రీ, మినీ థియేటర్, స్టార్ హోటల్, షాపింగ్ సెంటర్ ఏర్పాటు చేసి.. ఓ కమర్షియల్, టూరిజం సెటర్గా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అంటే.. విగ్రహానికి నికరంగా అయ్యే ఖర్చు రూ. 155 కోట్లు మాత్రమే. మిగతావన్నీ.. ఉత్పాదక ఖర్చు. ఎలా చూసినా… వెయ్యి కోట్లు ఖర్చు చేయడం అనేది సత్యదూరమైన వార్త. ప్రాజెక్ట్ మొత్తం కలిసి.. నాలుగు, ఐదు వందలకోట్లు అయితే.. దానికి రూ. వెయ్యి కోట్ల రౌండ్ ఫిగర్ వేసి.. దుష్ప్రచారం చేయడం కేవలం రాజకీయ లాభం కోసమే..!
ఎన్టీఆర్ విగ్రహానికి ప్రజాధనాన్ని వినియోగిస్తారా..?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ విగ్రహానికి ఒక్కటంటే.. ఒక్క రూపాయి కూడా కేటాయించడం లేదు. అలాగని వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా దొడ్డి దారిన కేటాయిస్తుందేమో అన్న అనుమానం కూడా అవసరం లేదు. ఎందుకంటే.. ఈ ప్రాజెక్ట్ పూర్తిగా సీఆర్డీఏ చేపడుతుంది. కానీ… దీని కోసం ప్రత్యేకంగా ఖర్చు చేయడం లేదు. ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసి… ఆ ట్రస్ట్ ద్వారా వచ్చే విరాళాలతోనే చేపడుతుంది. ఈ విషయంలో ఏ ప్రభుత్వ విభాగము కూడా రూపాయి కేటాయించదు. అంటే… ప్రజాధనాన్ని ఎన్టీఆర్ విగ్రహం కోసం ఖర్చు చేయడం లేదు. అయితే ఈ వెయ్యి
పటేల్ విగ్రహానికి పెట్టింది ప్రజాధనమే..!
గుజరాత్ లో మూడున్నర వేల కోట్లతో నిర్మించిన పటేల్ విగ్రహాన్ని ప్రజాధనంతోనే నిర్మించారు. గుజరాత్ ప్రభుత్వం కొంత మొత్తం నేరుగా.. కేంద్ర ప్రభుత్వం మరికొంత మొత్తం నేరుగా బడ్జెట్లలోనే కేటాయించాయి. ఇక మిగతా సొమ్ము మొత్తం.. ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు.. సర్ చార్జీల పేరుతో బాది… ఆ సొమ్మును పటేల్ విగ్రహానికి..కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ ఖాతాలో ఇచ్చేశాయి. ఇలానే రెండున్నర వేల కోట్లు.. ఆ విగ్రహానికి వచ్చాయి. అదంతా ప్రజల వద్ద నుంచి వసూలు చేసిన మొత్తం. కానీ.. ఎన్టీఆర్ విగ్రహానికి ఏ ప్రభుత్వ సంస్థ కూడా.. సీఎస్ఆర్ నిధులు ఇవ్వదు. ప్రైవేటు వ్యక్తులు ఇచ్చే విరాళాలతో.. ఏర్పాటు చేయబోయే ట్రస్ట్… ఆ విగ్రహం చుట్టూ ఏర్పాటు చేయబోయే కమర్షియల్ కార్యకలాపాల వ్యవహారాలతో మాత్రమే నిధులు సమకూర్చుకుంటుంది.
ప్రభుత్వం చేసే ప్రతీ పనిని విమర్శించవచ్చు కానీ.. నిజానిజాలను ప్రజల ముందు ఉంచితే… దానికో అర్థం ఉంటుంది. కానీ.. అలా జరిగిపోతోందన్న ఉద్దేశంతో కల్పితంగా అవాస్తవాలు ప్రచారం చేస్తే.. అంతిమంగా అది ఏపీ ప్రజలకే నష్టం చేస్తుంది.
—సుభాష్