కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ఈరోజు ఎంపిక చేసిన స్మార్ట్ సిటీస్ జాబితాను ప్రకటించారు. దీనికోసం అన్ని రాష్ట్రాల నుంచి మొత్తం 97పట్టణాల అభివృద్ధికి ప్రతిపాదనలు రాగా, వాటికి వివిధ ప్రామాణికాల ప్రకారం వచ్చిన మార్కుల ఆధారంగా తొలివిడతలో మొత్తం 20 నగరాలను, పట్టణాలను స్మార్ట్ సిటీస్ గా అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. చాలా పారదర్శకంగా ఈ ఎంపిక చేసామని ఆయన తెలిపారు.
ఆ జాబితాలో అన్నిటికంటే 78.83 శాతం స్కోరు సాధించి భువనేశ్వర్ (ఓడిశా) అగ్రస్థానంలో నిలిచింది. ఆ తరువాత వరుసగా పూణే (మహారాష్ట్ర), జైపూర్ (రాజస్థాన్), సూరత్ (గుజరాత్), కొచ్చి (కేరళ), అహ్మదాబాద్ (గుజరాత్), జబల్ పూర్ (మధ్య ప్రదేశ్), విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్), షోలాపూర్ (మహారాష్ట్ర), దావణగేరే (కర్నాటక), ఇండోర్ (మధ్యప్రదేశ్), డిల్లీ, కోయంబత్తూర్ (తమిళనాడు), కాకినాడ (ఆంధ్రప్రదేశ్), బెల్గావి (కర్నాటక), ఉదయ్ పూర్ (రాజస్థాన్), గౌహతి (అస్సాం), చెన్నై (తమిళనాడు), లుధియానా (పంజాబ్), భోపాల్ (మధ్య ప్రదేశ్) స్మార్ట్ సిటీస్ గా అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేయబడ్డాయి.
ఈ జాబితా ప్రకారం అత్యధికంగా మధ్యప్రదేశ్ కి మూడు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర , గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలకి చెరో రెండు చొప్పున, అస్సాం, కేరళ, పంజాబ్, డిల్లీలకి ఒక్కో స్మార్ట్ సిటీని అభివృద్ధి చేసుకొనే అవకాశం దక్కింది. తెలంగాణాతో సహా అనేక రాష్ట్రాలకు ఈ జాబితాలో చోటు దక్కలేదు. మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా మొత్తం వంద స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయాలని భావిస్తోంది కనుక మిగిలిన రాష్ట్రాలకు తరువాత జాబితాలలో చోటు దక్కవచ్చును. ఈ స్మార్ట్ సిటీల అభివృద్ధికి కేంద్రం సుమారు రూ.3.30 లక్షల కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు సమాచారం.