తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గొప్ప విజయం సాధించిందా..? అవుననే అంటున్నారు… ఆ పార్టీకి చెందిన ఉత్తరప్రదేశ్ ఎంపీ జీవీఎల్ నరసంహారావు. యూపీ నుంచి ఎంపీగా ఎన్నికలయినప్పటికి.. తెలుగు రాష్ట్రాల బీజేపీని తనే భుజాలపై మోస్తున్నట్లుగా… షో చేస్తూ.. ఆయన హైదరాబాద్, విజయవాడల్లో ఎక్కువ కాలం గడుపుతూంటారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. తెలంగాణలో గెలవబోతున్నామని ప్రకటనలు చేశారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని హడావుడి చేశారు. 70 సీట్లు గెలుస్తామని తొడకొట్టినంత పని చేశారు. చివరికి ఫలితాలొచ్చాక సౌండ్ లేదు. ఇప్పుడు హైదరాబాద్ కు వచ్చింది.. ఏమంటున్నారో తెలుసా… ? తెలంగాణలో బీజేపీకి ఒక్క అసెంబ్లీ సీటు రావడం గొప్ప విషయం అంటున్నారు.
ఎందుకిలా గొప్పగా అనుకుంటున్నారంటే.. తెలుగుదేశం పార్టీతో పోల్చుకుంటున్నారు. టీడీపీకి రెండే సీట్లు వచ్చాయి కదా అని లాజిక్ తీసుకుంటున్నారు. టీడీపీని వదిలేశాక తమ ఓటు బ్యాంక్ పెరిగిందని.. అలవాటైన పద్దతిలో స్వయం తృప్తి పొందే ప్రయత్నం చేశారు కానీ.. ఆయన 118 నియోజకవర్గాల్లో పోటీ చేసిన విషయాన్ని మర్చిపోయారు. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని ఐదు ఎమ్మెల్యే సీట్లు సాధించారని.. బీజేపీకి అంత సీన్ లేదని.. ఈ ఎన్నికల్లో తేలిపోయిందని.. వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పుకోలేక జీవీఎల్.. తమ పార్టీకి ఒక్క సీటు రావడమే గొప్ప అంటున్నారు. మరి అంత గొప్ప అయితే.. ఎన్నికలకు ముందు జీవీఎల్ నరసింహారావు అంతగా ఎందుకు మిడిసిపడ్డారో ఎవరికీ అర్థం కావడం లేదు.
సెఫాలజిస్ట్ కూడా అయన జీవీఎల్.. ఎన్నికల్లో తమ పార్టీ పరిస్థితి ఇలా ఉంటుందని హైకమాండ్ కు చెప్పి.. కనీసం పరువు కాపాడే ప్రయత్నం ఎందుకు చేయలేదో మరి..! . ఢిల్లీలో అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు మిడిసిపడి… కింద పడినా తమదే పైచేయి అని నిరూపించుకునేందుకు..సొంత పార్టీని కూడా కించపరుస్తున్న విషయాన్ని ఈ రాజకీయ మేధావి గుర్తించలేకపోతున్నారని… తోటి బీజేపీ నేతలు మండి పడుతున్నారు. కానీ ఆయన వినిపించుకోరు.. అంతే..!