కేంద్రం తాన అంటే రాష్ట్ర భాజపా నేతలు తందాన అంటారు! ఇదీ ఏపీలోని భాజపా నాయకుల పరిస్థితి. వారు కేంద్రం తరఫున రాష్ట్రంలో నాయకులా… రాష్ట్రం తరఫున జాతీయ పార్టీలో ఉన్న నాయకులా అనే స్పష్టత వారి తీరులో ఎప్పుడూ కనిపించదు. భాజపా నాయకురాలు పురందేశ్వరి తాజాగా ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడారు. దీన్లో ఆంధ్రాకి కేంద్రం చేస్తున్న సాయం గురించి చెప్పారు. పోలవరం, రైల్వేజోన్, కడప ఉక్కు కర్మాగారం… వీటిపై ప్రధానంగా మాట్లాడుతూ కేంద్రం చేయాల్సిన దానికన్నా ఎక్కువే చేస్తోందన్నారు. రాష్ట్రంలో నిర్మితమౌతున్న మరుగుదొడ్లు, ఇళ్లు… ఇవన్నీ కేంద్ర నిధులతో జరుగుతున్న పనులన్నారు.
విశాఖ రైల్వే జోన్ గురించి మాట్లాడుతూ.. ‘వైజాగ్ రైల్వే జోన్ కావాలనే విషయం మనందరికీ తెలుసు. దానికి సంబంధించి కూడా మేము ఇవ్వం అని చెప్పి ఎక్కడా కేంద్రం చెప్పలేదు. జాప్యం జరుగుతున్న మాట వాస్తవమే. ఎందుకంటే, ఇది రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశం. దాన్ని కొంచెం సున్నితమైన అంశంగా గుర్తించాం, దాని మీద ప్రయత్నాలు కొనసాగుతున్న అంశాన్ని ప్రజలందరూ గుర్తించాలని అభ్యర్థిస్తున్నాం’ అన్నారు పురందేశ్వరి. విభజిత ఆంధ్రాను ఆదుకునే క్రమంలో ఇస్తామన్నది కదా రైల్వేజోన్..? మరి, ఇప్పుడు ఇది రెండు రాష్ట్రాల మధ్య సున్నితమైన అంశం ఎలా అవుతుంది..? ఒడిశాతో ఏంటి సంబంధం..? విశాఖ రైల్వేజోన్ ను ఆంధ్రా, ఒడిశాల మధ్య సమస్యగా ఎందుకు మార్చి చూస్తున్నారు..? వాస్తవానికి ఇది భాజపాకి సున్నితాంశం..! వారి రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా సున్నితాంశం. ఆంధ్రాకి జోన్ ఇచ్చేస్తే.. ఒడిశాలో తమ పార్టీ గతేంటని రాజకీయ లబ్ధి కోణం నుంచి ఆలోచిస్తున్నారు కాబట్టి అలా కనిపిస్తోంది.
పోలవరం నిధుల గురించి కూడా పురందేశ్వరి మాట్లాడారు. రాష్ట్రం తమకు రావాల్సిన దాదాపు రూ. 3 వేల కోట్లకుపైగా బిల్లులపై ఈ మధ్య చాలా విమర్శలు చేస్తోందనీ, అంతకుముందు కేంద్రం చేసిన సాయం గురించి ఎందుకు మాట్లాడటం లేదన్నారు..? ఈ దాటవేత ధోరణి చూస్తుంటే.. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును ఇప్పట్లో చెల్లించేది లేదని చెబుతున్నట్టే కదా! కడప ఉక్కు కర్మాగారం గురించి మాట్లాడుతూ… కేంద్రం అడిగిన సమాచారాన్ని రాష్ట్రం ఇంకా ఇవ్వలేదనీ, అందుకే జాప్యం జరుగుతోందన్నారు. ఓపక్క సుప్రీం కోర్టులో కడప కర్మాగారం సాధ్యం కాదని అఫిడవిట్లు వేసేసి, ఇంకోపక్క ఇలా మాట్లాడటాన్ని ఏమంటారు..? కేంద్రం ఇస్తామంటే వద్దని రాష్ట్రం ఎందుకు అంటుంది..? దుగరాజపట్నం పోర్టు ఆలస్యానికి కూడా రాష్ట్రమే కారణమన్నట్టుగా పురందేశ్వరి మాట్లాడారు. విచిత్రం ఏంటంటే… భాజపా తరఫున ఇంతగా వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నది ఆంధ్రాకి చెందిన నాయకులు కావడం!