ఈగలాంటి సినిమా తీసిన సాయి కొర్రపాటి అంటే… టాలీవుడ్‌కి ప్రత్యేకమైన గౌరవం. దాన్ని నిలుపుకుంటూనే కుటుంబ సమేతంగా చూసేలా సినిమాల్ని తీస్తుంటారాయన. వారసత్వ హీరోల్ని తెరపై తీసుకురావాలనుకున్నప్పుడు కూడా నిర్మాతగా సాయి కొర్రపాటి పేరే ప్రస్తావనకు వస్తుంటుంది. చిరంజీవి సైతం తన అల్లుడు కల్యాణ్ దేవ్ ని సాయి కొర్రపాటి చేతుల్లోనే పెట్టారు. సాయి కొర్రపాటి సినిమా అనగానే ఫ్రీ పబ్లిసిటీ దొరికేస్తుంది. అదే ఆయన బలం, బలహీనతగా మారింది. ఈమధ్య ఆయన తన సినిమాల పబ్లిసిటీపై ఏమాత్రం దృష్టి పెట్టడం లేదు. `విజేత` సినిమాకి కూడా ఆయన ఎలాంటి పబ్లిసిటీ లేకుండా వదిలేశారు. ఇప్పుడు `కేజీఎఫ్`దీ అదే తీరు.
ఈ కన్నడ సినిమా దేశ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. కన్నడలోనే భారీ బడ్జెట్‌తో రూపొందించిన చిత్రమిది. ట్రైలర్లు ఆకట్టుకున్నాయి. రాజమౌళి లాంటివాడే ఈ సినిమా విజువల్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఈ సినిమాని తెలుగులో సాయి కొర్రపాటి విడుదల చేస్తున్నాడు. రేపు సినిమా విడుదల. అయితే ఇప్పటి వరకూ ఎలాంటి ప్రమోషన్ ఈ సినిమాకి దక్కలేదు. శుక్రవారం విడుదల అవుతున్న పడి పడి లేచె మనసు, అంతరిక్షం సినిమాలు పోటీ పడి మరీ ప్రచారం చేస్తున్నాయి. ఈ కన్నడ డబ్బింగ్ మాత్రం గప్ చుప్ గా ఉండిపోయింది. కనీసం చిత్రబృందాన్ని తీసుకొచ్చి, ప్రెస్ మీట్లు పెట్టడం, ఇంటర్వ్యూలు నిర్వహించడం లాంటి కనీసం ప్రమోషన్ కార్యక్రమాలు కూడా సాయి కొర్రపాటి చేయలేదు. విడుదల ముందు ఈ సినిమాకి వచ్చిన క్రేజ్, హైప్ అంతా ఇంతా కాదు. దాన్ని సాయి కొర్రపాటి ఏమాత్రం కొనసాగించలేకపోయారు. అనుకున్న స్థాయిలో థియేటర్లు దొరక్కపోవడం, `కేజీఎఫ్` కన్నడ నిర్మాతలు కూడా.. సడన్‌గా ప్రమోషన్ కార్యక్రమాలు ఆపేయడం.. కాస్త దెబ్బకొట్టాయి. అసలు ఈ శుక్రవారం తెలుగులో ఈ సినిమా విడుదల అవుతున్న సంగతే.. సగటు ప్రేక్షకుడికి చేరలేదు. సాయి కొర్రపాటి సినిమాలకు పబ్లిసిటీ సరిగా ఉండదు.. అన్న కామెంట్‌ని ఈ సినిమా మరింత బలపరుస్తోంది. మరి ఇన్ని ఇబ్బందుల్ని, ఇంత గట్టి పోటీనీ కేజీ ఎఫ్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.