గడచిన నాలుగేళ్లలో రాష్ట్రం కోసం ఎవరు పాటుపడ్డారో, ఇక్కడి సమస్యల్ని ఎవరు సమర్థంగా ఎదుర్కొని ముందుకు సాగుతున్నారో ప్రజలు ఆలోచించాలన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తిరుపతిలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణానికి పునాది ప్రధాని నరేంద్ర మోడీతో వేయించామనీ, కనీసం దాని కోసమైనా సహకరిస్తారేమోనని ఆశిస్తే, ఆ పరిస్థితి లేకుండా చేశారన్నారు. కక్ష కట్టిమరీ ఆంధ్రా అభివృద్ధికి అడ్డుపడ్డారనీ, గుజరాత్ కి ధీటుగా మిన్నగా ఆంధ్రులు ముందుకుపోతారనే భయంతోనే అన్యాయం చేశారని ఆరోపించారు. ఏవో కొన్ని రాజకీయ పార్టీలు అండగా ఉంటాయని ప్రజలకు అన్యాయం చేయడం మంచిది కాదన్నారు.
గడచిన నాలుగున్నర సంవత్సరాలుగా తాను ఏం చేశాననేది శ్వేత పత్రం విడుదల చేస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. వాటన్నింటినీ ప్రజలు స్టడీ చేయాలనీ, చర్చించాలని కోరారు. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న కుట్రల్ని గుర్తుపెట్టుకోవాలనీ, అభివృద్ధికి అడ్డు పడుతున్నారన్నారు. ఒకప్పుడు ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతు ఇచ్చి, ఆ తరువాత మాట మార్చి అడ్డుపడుతున్న తెరాసకు మద్దతుగా వీరు మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్, పవన్ చేసిన పోరాటాలేంటో చెప్పాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎదుర్కోవడానికి వీరు భయపడతారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే.. మరోసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలన్నారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలు సక్రమంగా అమలు కావాలంటే… 25 పార్లమెంటు స్థానాలూ టీడీపీ గెలవాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ విభజన చట్టం తెచ్చిందనీ, వాటిని బీజేపీ అమలు చేయలేదన్నారు. ప్రత్యేక హోదాను కూడా ఇస్తామని చెప్పి అమలు చేయలేదనీ, జాతీయ స్థాయిలో పదిమంది ఉంటే తప్ప పోరాడలేమన్న ఉద్దేశంతో.. కాంగ్రెస్ పార్టీ సహకారం కూడా తీసుకున్నామన్నారు. ఇది తనకోసం కాదనీ, రాష్ట్రం కోసమనీ, పిల్లల భవిష్యత్తు కోసమని చంద్రబాబు చెప్పారు. మనం ఒంటరి పోరాటం చేస్తే ఎవ్వరూ మన మాట వినరనీ, మనకు కలిసొచ్చే అన్ని పార్టీలతో పోరాటం చేస్తున్నామన్నారు.
ముఖ్యమంత్రి ప్రసంగంలో ఎన్నికల మూడ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రాలో భాజపాతో సహా అభివృద్ధికి అడ్డుపడే పార్టీలన్నీ ఒకవైపు, పోరాటాలు చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలకు కష్టపడుతున్న టీడీపీ మరొకవైపు అనే ప్రచారమే ఎన్నికల నినాదం కాబోతోందని చెప్పుకోవచ్చు. ఇంకోటి… కాంగ్రెస్ తో పొత్తుపై మరోసారి స్పష్టత ఇచ్చారు. పదిమందితో కలిసి పోరాడితే తప్ప రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకునే పరిస్థితి లేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.