ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఈ మధ్య వరుసగా ఘాటైన విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపు తరువాత… తన ఇమేజ్ పై ఎద్దేవా చేస్తూ ఇన్నాళ్లూ వినిపించిన విమర్శల్ని ఒక్కోటిగా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మోడీ సర్కారు విధించిన జీఎస్టీని గబ్బర్ సింగ్ ట్యాక్స్ అంటూ రాహుల్ గాంధీ తరచూ ఎద్దేవా చేస్తుంటారు. ఈ ట్యాక్స్ బారిన పడిన చిన్న వ్యాపారులకు కాంగ్రెస్ మద్దతుగా ఉంటుందని రాహుల్ చెబుతూ వస్తున్నారు. దానికి తగ్గట్టుగానే, జీఎస్టీ వల్ల భాజపాకి కొంత నష్టం జరిగిందనేది మూడు రాష్ట్రాల ఫలితాలు స్పష్టం చేశాయి. పైగా, ఫిబ్రవరి చివరి వారానికే లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది. ఈ నేపథ్యంలో… 99 శాతం వస్తువుల్ని18 లేదా, అంతకంటే తక్కువ శాతం జీఎస్టీ స్లాబ్ పరిధిలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టు ప్రధానమంత్రి ఓ సదస్సులో పేర్కొన్నారు.
దీనిపై రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. గబ్బర్ సింగ్ ట్యాక్స్ విషయంలో మోడీ మొద్దు నిద్రను ఎట్టకేలకు లేపగలిగామంటూ ట్వీట్ చేశారు. అయినా, మోడీ ఇంకా కాస్త కునుకుపాట్లు పడుతున్నారు అన్నారు. ఒకప్పుడు తాము ఏం సూచించినా పనికి మాలిన ఆలోచనలుగా తీసి పడేసేవారనీ, తానేం చెప్పినా ఎద్దేవా చేసేవారంటూ గుర్తుచేశారు. గతంలో తాము సూచించినవే ఇప్పుడు మోడీ అమలు చేస్తున్నారన్నారు. కాస్త ఆలస్యంగానైనా కళ్లు తెరిచారనీ, అసలు ఏమీ చెయ్యకుండా ఉండే బదులు, కనీసం ఇప్పుడైనా ఏదో ఒకటి చేయాలని అనుకోవడం మంచిదే కదా ప్రధాని గారూ అంటూ ట్వీట్ చేశారు.
జీఎస్టీ విషయంలో మోడీ ఇప్పుడు జాగ్రత్తపడుతున్నారని చెప్పొచ్చు! ఎందుకంటే, కాంగ్రెస్ పార్టీ ‘చోటే దుకాన్ దార్’ అంటూ జీఎస్టీ బాధితులను ప్రత్యేకంగా ఒక వర్గంగా చూస్తూ… తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. రాహుల్ గాంధీ ప్రసంగాల్లో గమనిస్తే… పేదలు, రైతులు, కార్మికులు, మహిళలు, ఉద్యోగులు.. వీళ్లతోపాటు చోటే దుకాన్ దార్ అంటున్నారు. కాబట్టి, వారిని మళ్లీ తమవైపునకు మళ్లించుకోవడమే మోడీ సర్కారు తాజా ఆలోచన వెనకున్న వ్యూహం. వాస్తవం ఏంటంటే, జీఎస్టీ వల్ల రాజకీయంగా భాజపాకి జరగాల్సిన నష్టం జరిగిపోయిందనే చెప్పాలి. అంతేకాదు, ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా గతంలో తాము చేసిన సూచనే అంటూ క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం రాహుల్ చేస్తున్నారు.