తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాజకీయ వ్యూహాల్లో మార్పు కనిపిస్తోంది. తెలంగాణ ఎన్నికల నుంచి తాము చాలా నేర్చుకున్నామని… పార్టీ శ్రేణులకు చెబుతూ వస్తున్నారు. ఆ క్రమంలో కొన్ని కీలక పరిణామాలు, మార్పులు ఉంటాయని కూడా చెబుతున్నారు. అసలు చంద్రబాబు… తెలంగాణ ఎన్నికల నుంచి ఏమి నేర్చుకుని ఉంటారు..?
కేసీఆర్ తరహాలో ముందుగా అభ్యర్థుల్ని ప్రకటిస్తే ఏం లాభం..?
తెలంగాణ ఎన్నికల విషయంలో ప్రధానంగా టీడీపీ అధినేత చంద్రబాబు చెబుతున్న మార్పు… అభ్యర్థుల ప్రకటనలో ఉంది. చంద్రబాబు సహజంగా.. నామినేషన్లు చివరి రోజు వరకూ.. కొన్ని చోట్ల అభ్యర్థుల్ని తేల్చరు. అలాంటిది.. ఇప్పుడు… జనవరిలోనే మెజార్టీ ఆభ్యర్థుల్ని ప్రకటిస్తానంటున్నారు. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ … అసెంబ్లీని రద్దు చేసిన రోజే 105 మంది అభ్యర్థుల్ని ప్రకటించారు. నిజానికి వారిలో చాలా మందిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. కేసీఆర్ అంటూ ఓడిపోతే.. అది ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత వల్లేనని ప్రచారం జరిగింది. కానీ ముందస్తుగా అభ్యర్థుల్ని ప్రకటించడం వల్ల… అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకతను తగ్గించుకోవడానికి ఉపయోగపడింది. వారు ప్రజల్లోకి వెళ్లి మళ్లీ మద్దతు పొందగలిగారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించే సరికి పుణ్యకాలం గడిచిపోయింది. కనీసం అభ్యర్థులపై కాంగ్రెస్ కు ఓ అవగాహనకు రాక ముందే టీఆర్ఎస్ అడ్వాంటేజ్ సాధించింది. ఎమ్మెల్యేలపై ఉన్న చిన్న చిన్న అసంతృప్తుల్ని కవర్ చేసుకోగలిగారు. చంద్రబాబు కూడా.. ఇదే ఫార్ములా ఫాలో అవ్వాలనుకుంటున్నారు.
ఏపీలో ఎమ్మెల్యేల పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందా..?
ఏపీలో కూడా తెలంగాణ లాంటి పరిస్థితే ఉంది. కేసీఆర్ పట్ల ప్రజల్లో ఉన్నంత సానుకూలత అక్కడ ఉందో లేదో కానీ… ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది. అనేక మంది ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ ఎమ్మెల్యేల పట్ల ఉన్న వ్యతిరేకతను… కవర్ చేసుకోవడానికి అభ్యర్థుల్ని ముందే ప్రకటించే అవకాశం ఉంది. అలాగే… పార్టీలోనూ.. అసంతృప్తి ఉంది. అనేక మంది ఎమ్మెల్యేలపై సొంత పార్టీలోనే క్యాడర్ అంగీకరించలేని పరిస్థితి ఉది. గత ఎన్నికల తర్వాత టీడీపీలోకి విస్తృతంగా వలసలను ప్రొత్సహించారు. పాత, కొత్త నేతల మధ్య సమన్వయం లేదు. ఈ అసమ్మతిని కవర్ చేసుకోవడానికి కూడా.. ముందుగా అభ్యర్థుల్ని ప్రకటిస్తారని చెబుతున్నారు.
కాంగ్రెస్‌తో పొత్తుపై చంద్రబాబు నిర్ణయం తీసుకోగలరా..?
తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ పొత్తు ఫలించలేదు. ప్రజలు హర్షించలేదు. దాంతో.. ఇప్పుడు.. ఏపీలో పొత్తు పెట్టుకోవాలా వద్దా అనేది.. చంద్రబాబుకు నాయుడుకు పెద్ద క్వశ్నన్గా మారింది. సెంటిమెంట్ కారణంగా… తెలంగాణలో … కాంగ్రెస్, టీడీపీ పొత్తును హర్షించలేదు. అదే సెంటిమెంట్‌ను చంద్రబాబు ఏపీలో పెంచారు. ఏపీని దారుణంగా అన్యాయం చేసి విభజించిన కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. అలాంటి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఫలితాలు ఎలా వస్తాయోననేది టీడీపీ ఆందోళన. ఏపీకి ప్రత్యేకహోదా సహా.. ఎలాంటి హామీలు అమలు చేయని.. బీజేపీని గెలవకుండా..మోడీని మళ్లీ అధికారంలోకి రానివ్వకుండా చేసేందుకే కాంగ్రెస్‌తో కలసి పని చేస్తున్నానని.. చంద్రబాబు చెబుతున్నారు. ఈ విషయంలో… ప్రజలను కన్విన్స్ చేయగలగాలి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి సీట్లు కేటాయిస్తే.. ఆ స్థానాల్లో ప్రజలు ఓట్లేస్తారా..? అన్నది కూడా కీలకమే. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ… ఇతర పార్టీలకు కేటాయిచిన సీట్లలో… కాంగ్రెస్ ఓట్లు పడలేదని… ఎన్నికల గణాంకాలు చెబుతున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి ముందస్తుగా అభ్యర్థుల్ని ప్రకటించాలనుకుంటున్నారు.
కేసీఆర్‌కు ఇచ్చినట్లుగా ప్రజలు చంద్రబాబుకు మద్దతిస్తారా..?
అయితే తెలంగాణ రాజకీయ పరిస్థితులకు.. ఏపీ రాజకీయ పరిస్థితులకు కొంత తేడా ఉన్నాయి. తెలంగాణలో కేసీఆర్ కు ప్రజలు మద్దతు పలికారు. అక్కడ చంద్రబాబుకు ప్రజలకు ఆ స్థాయిలో మద్దతు పలుకుతారా లేదా అన్నది ముఖ్యం. అలాగే.. ఏపీలో సామాజిక సమీకరణాలు కీలకమవుతాయి. తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. ఏీపలో ప్రత్యేకహోదా సెంటిమెంట్ ఉంది. తెలంగాణలో కాంగ్రెస్‌తో పోలిస్తే.. ఏపీలో వైసీపీ బలంగా ఉంది. ఇలా.. భిన్నమైన రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల.. తెలంగాణలో కేసీఆర్ చేసినట్లుగా.. ఏపీలో రాజకీయ వ్యూహాలు చేస్తే.. విజయవంతం అవుతాయా లేదా అన్నది చెప్పడం కష్టం.