అసెంబ్లీ ఎన్నికల విజయం తరువాత జాతీయ రాజకీయాలపైనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కువగా శ్రద్ధపెడుతున్నారు. గడచిన రెండ్రోజుల్లో ఆయన నిర్వహించిన సాగు, తాగు నీటి ప్రాజెక్టుల రివ్యూల వెనక కూడా వ్యూహం అదే కనిపిస్తోంది. ఇంటింటికీ నీళ్లు ఇవ్వడం, సాగునీటి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయడంపై మార్చి నెలకు ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు. అంటే, లోక్ సభ ఎన్నికల్లోపు వీటిని పూర్తి చేసుకుని… ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం కాబట్టి, పార్లమెంటు ఎన్నికల్లో కూడా తెరాసకు ఓటెయ్యండని ప్రజలను కోరాలనేది కేసీఆర్ ఆలోచన. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రావాలన్నా, రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరగాలన్నా… జాతీయ స్థాయిలో మనం కీలకం కావాలనే నినాదంతోనే ప్రచారం చేస్తారు. ఇది, తెలంగాణ ఎంపీ సీట్ల వరకూ ఆయన అనుసరించే వ్యూహంగా కనిపిస్తోంది.
ఇతర రాష్ట్రాల విషయానికొస్తే… క్రిస్మస్ తరువాత కేసీఆర్ ఒడిశా వెళ్తారని సమాచారం. నవీన్ పట్నాయక్ తో భేటీ అవుతారనీ, జాతీయ రాజకీయాలపై చర్చిస్తారని తెలుస్తోంది. వాస్తవానికి, కేసీఆర్ నినాదమైన భాజపాయేతర, కాంగ్రెసేతర రాజకీయ ప్రత్యామ్నాయం అనే ఆలోచనతో ఉన్న పార్టీలు దేశవ్యాప్తంగా ప్రస్తుతానికి ఏవైనా ఉన్నాయంటే… తెరాస మినహా మరో మూడు మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ విషయంలో నవీన్ పట్నాయక్ కాంగ్రెస్, భాజపాలకు దూరంగా ఉంటారనే వాతావరణం స్పష్టంగానే ఉంది. ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ, బీఎస్పీలు కూడా ఇదే వైఖరితో ఉన్నాయి. అయితే, వారు భాజపాకి దూరం ఉండటం కోసం గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో కలిశారు. ఇప్పుడు కూడా ఎన్నికల తరువాత తమకు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనీ, డిమాండ్ చేసుకునే శక్తి తమ దగ్గర ఉండాలనే లక్ష్యమే మాయావతి, అఖిలేష్ ల కలయికలో కనిపిస్తోంది.
వీరంతా కేసీఆర్ లెక్కల్లో ఉన్నట్టే లెక్క! అఖిలేష్, మాయావతి, నవీన్ పట్నాయక్… వీరంతా సాధించే ఎంపీ స్థానాలతోపాటు తెరాస గెలుచుకునే సంఖ్య… ఇవన్నీ కలిపితే కీలకమైన శక్తిగా అవతరించొచ్చు అనేది కేసీఆర్ లెక్కగా ప్రస్తుతానికి కనిపిస్తోంది. ఆంధ్రాలో వైకాపాకి దక్కే ఎంపీ స్థానాలను కూడా ఆయన ఈ అంచనాల్లో కలిపి చూసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే… కేసీఆర్ ఆలోచిస్తున్న కూటమికి మద్దతుగా ఎన్నికల ముందుగానే ఒక వేదిక మీదికి వచ్చే పార్టీల ఎన్ని అనే ప్రశ్న ఉండనే ఉంది. ప్రస్తుతం కేసీఆర్ చేయబోతున్న పర్యటనల వెనక వ్యూహం కూడా ఎన్నికల తరువాతి పరిస్థితులను అంచనా వేసే చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. రాబోయే రెండు నెలలు ఆయన ఇదే పనిలో ఉంటారు కాబట్టి… లోక్ సభ ఎన్నికలు వచ్చేసరికి కేసీఆర్ వ్యూహం ఏంటనేది మరింత స్పష్టంగా తెలుస్తుంది.