కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేసిన వ్యవహారం .. తెలంగాణ కాంగ్రెస్ నేతల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇలాంటి పరిణామం జరగబోతోందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్నా… పెద్దగా పట్టిచుకోని నేతలు… తీరా.. మిగిలిపోయిన ఎమ్మెల్సీ కాంగ్రెస్ ఎల్పీ మీటింగ్ పెట్టినట్లు… టీఆర్ఎస్ విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు లేఖ తీసుకెళ్లి స్వామిగౌడ్ కు ఇచ్చిన తర్వాత గగ్గోలు పెట్టడం ప్రారంభించారు. నిబంధనల ప్రకారం.. విలీనం చెల్లదని.. మండలి చైర్మన్ ను కలిసి.. ఉత్తమ్, షబ్బీర్ అలీ లేఖ ఇచ్చారు. కాంగ్రెస్ జాతీయపార్టీ కాబట్టి విలీనానికి అవకాశం లేదని వీరిద్దరూ లేఖలో పేర్కొన్నారు. నలుగురు ఎమ్మెల్సీలు ఇచ్చిన లేఖను పరిగణనలోకి తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. కానీ స్వామిగౌడ్ చేతుల్లో కూడా ఆ విషయం లేదని తెలిసినా.. దింపుడు కళ్లెం ఆశలు పెట్టుకున్నారు ఉత్తమ్, షబ్బీర్.
కాంగ్రెస్ఎల్పీని టీఆర్ఎస్లో కలుపుతున్నట్టు లేఖ ఇవ్వడం దారుణమని ఉత్తమ్ మండి పడ్డారు. లేఖ వెనుక ఎవరున్నారో తెలంగాణ సమాజం గమనించాలని ఆయన కోరారు. ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోష్ సీఎల్పీ మీటింగ్ పెట్టుకున్నట్టు చెప్పారని.. కాంగ్రెస్‌లో లేని వాళ్లు సీఎల్పీ మీటింగ్ ఎలా పెడతారని ఉత్తమ్ ప్రశ్నిస్తున్నారు. అసలు ఆకుల లలిత, సంతోష్‌కు సీఎల్పీ మీటింగ్ పెట్టే అధికారం లేదన్నారు. ప్రభాకర్, దామోదర్‌రెడ్డి రెండేళ్ల కింద పార్టీ మారారని… ఎప్పుడో వారిపై అనర్హతా వేటు వేయమని.. లేఖలు ఇచ్చినా…వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చైర్మన్ న్యాయబద్దంగా వ్యవహరించి మండలి ప్రతిష్ఠను కాపాడాలని సూచించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలను సస్పెండ్ చేయాలని గతంలో లేఖ ఇచ్చామని… మేం ఇచ్చిన లేఖపై ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదని షబ్బీర్ అలీ మండి పడ్డారు. అదే కాంగ్రెస్ లో చేరిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని.. టీఆర్ఎస్ కోరగానే వెంటనే స్పందించారని.. ఇదెక్కడి న్యాయమని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. ప్రజాస్వామ్య విలువలు పాటించాలని డిమాండ్ చేశారు.కానీ వీరి ఆవేదన అరణ్యరోదేనే అవుతోంది. కనీసం మీడియా కూడా.. కాంగ్రెస్ నేతల్ని పట్టించుకోలేదు. ఎమ్మెల్యేలు ఇంకా ప్రమాణస్వీకారం చేయలేదు. చేయక ముందే చాలా మంది పార్టీ మారుతారని.. వారు కూడా..నేరుగా టీఆర్ఎస్ఎల్పీలో భాగమవుతారని ప్రచారం చేస్తూ టీఆర్ఎస్ అగ్రనేతలు కాంగ్రెస్ లీడర్లని మరితగా టీజ్ చేస్తున్నారు.