యావత్ నందమూరి అభిమానులు, తెలుగు సినీ ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న.. `ఎన్టీఆర్` ట్రైలర్ వచ్చేసింది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జనవరి 9న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. కొద్ది సేపటి క్రితం ట్రైలర్‌ని ఆవిష్కరించారు. ఎన్టీఆర్జీవితంలోని ముఖ్యమైన మలుపులన్నీ ఈ ట్రైలర్లో కనిపించాయి. డైలాగుల రూపంలో వినిపించాయి. ఎన్టీఆర్ సినీ రంగ ప్రవేశం, కథానాయకుడిగా ఆయన విజృంభణ, రాజకీయాల్లో ప్రవేశం, ఆ తరవాత ప్రజా నాయకుడిగా ఎదగడం.. ఇవన్నీ ట్రైలర్లో చూపించారు. రెండు నిమిషాల ట్రైలర్లో కొన్ని వందల షాట్స్ కనిపించాయి.
రామారావేంటి? కృష్ణుడేంటి? అని చక్రపాణి సందేహిస్తే…
ఆ పాత్రకు ఆయన చక్కగా సరిపోతారు… ఆయనకళ్లలో ఓ కొంటెదనం ఉంటుంది.. అంటూ కెవి రెడ్డి వివరించిన డైలాగ్ తో ఈ టీజర్ ప్రారంభమైంది. సినిమాల్లో ఆయన చెప్పిన.. పాపులర్ డైలాగ్ ఒక్కటీ వినిపించకుండా.. నిజ జీవితంలోని సంఘటనలే తెరపై చూపిస్తూ ట్రైలర్కట్ చేశాడు క్రిష్. ఎక్కువగా ఎన్టీఆర్ – బసవతారకం అనుబంధంపైనే ఫోకస్‌పెట్టినట్టు కనిపిస్తోంది.
ట్రైలర్లో వినిపించిన డైలాగులు..
నేను ఉద్యోగం మానేశాను..
-ఎందుకు మానేశావ్.
నచ్చలేదు
– మరి ఏం చేద్దామని..?
సినిమాల్లోకి వెళ్తాను..
నిన్ను చూడ్డానికి జనాలు టికెట్లు కొనుక్కుని థియేటర్లకు వస్తున్నారు, ఇక నువ్వే వెళ్లి కనిపిస్తే ఇక నీ సినిమాలెవడు చూస్తాడు?
– జనం కోసమే సినిమా అనుకున్నా.. ఆ జనానికే అడ్డమైతే, సినిమా కూడా వద్దనుకుంటాను
అరవై ఏళ్లొస్తున్నాయి.. ఇన్నాళ్లు మా కోసం బతికాం. ఇక మీదట ప్రజల కోసం ప్రజల సేవలో బతకాలనుకుంటున్నాం..
నిన్నందరూ ఇక్కడ దేవుడు అంటున్నారు.. అక్కడ నువ్వుకూడా అందరిలాంటి మనిషివైపోతావా బావా…
– నన్ను దేవుడ్ని చేసిన మనిషి కోసం.. నేను మళ్లీ మనిషిలా మారడానికి సిద్ధంగా ఉన్నాను
ధనబలం అయితే బలుపులో కనిపిస్తుంది. కానీ ఇది జన బలం.. ఒక్క పిలుపులో వినిపిస్తుంది
గెటప్పులన్నీ కనిపించాయ్
ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ దాదాపు 70 గెటప్పుల్లో కనిపించనున్నారు. అందులో కొన్ని ముఖ్యమైన గెటప్పుల్ని ఇప్పటికే రివీల్ చేసింది చిత్రబృందం. చాలా ముట్టుకు ట్రైలర్ లోనూ కనిపించాయి. ఎన్టీఆర్ డైలాగ్ పలికే విధానం చాలా గంభీరంగా, వింతగా అనిపిస్తుంది. కానీ. బాలయ్య ఎన్టీఆర్‌ని అనుకరించలేదు. తనదైన శైలిలోనే డైలాగులు చెప్పారు. కీరవాణి నేపథ్య సంగీతం.. ట్రైలర్లో ఎమోషన్ని టచ్ చేసింది. చంద్రబాబు నాయుడు పాత్ర ఎక్కడా కనిపించకపోవడం.. ఈ ట్రైలర్‌లోని విశేషం. బహుశా.. `మహా నాయకుడు` పార్ట్ కోసం దాన్ని దాచి ఉంచారేమో.