టీడీపీ అధినేత చంద్రబాబు రూటు మార్చారు. సాఫ్ట్ గా ఉంటే.. ఎవరూ మాట వినడం లేదని… ఫైరవడం ప్రారంభించారు. సమన్వయ కమిటీ సమావేశంలో.. ఆ తర్వాత ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులతో జరిగిన సమావేశంలో.. నేతలపై విరుచుకుపడ్డారు. అతి విశ్వాసంతో పార్టీకి నట్టేట ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు. చిత్తూరు జిల్లాల నేతలలో అతి విశ్వాసం పెరిగి, పార్టీ కార్యక్రమాలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను ఎందుకు సీరియస్ గా తీసుకోవడంలేదని నిలదీశారు. ‘ఇప్పటి వరకు నేను సీరియస్ గా మాట్లాడితే మీరు బాధపడతారని ఆలోచించా…గట్టిగా మాట్లాడకపోతే ఇక ముందు నేను బాదపడాల్సి వస్తుంది. సున్నితంగా చెప్పినప్పుడే అర్దం చేసుకుని ముందుకు సాగాలి, రఫ్ గా మాట్లాడే వరకు తెచ్చుకోవద్దు. మీరు ఎంత బాదపడినా పర్వాలేదు…ఈ ఆరు నెలల కటువుగానే ఉంటా ‘ అని చంద్రబాబు స్పష్టం చేయడంతో.. నేతలంతా కంగుతినాల్సి వచ్చింది. ఇటీవలి కాలంలో చంద్రబాబు కోపాన్ని కూడా సాఫ్ట్ గా వ్యక్తం చేసేవారు. ఇప్పుడు మాత్రం పరిస్థితి మారిపోయింది.
సభ్యత్వ నమోదులో కొంతమంది నేతలు వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై కూడా చంద్రబాబు సీరియస్ కామెంట్స్ చేశారు. మీరు చేసే తప్పులకు పార్టీని నష్టపోనివ్వను…మీ వల్ల నేను ప్రజల్లో వీక్ అవుతున్నాను…మిమ్మల్ని గట్టిగా మందలిస్తే నేనైనా ప్రజల్లో బలపడతా…ఎవరు ఏమి అనుకున్నా నాకు పర్వాలేదు…ఈ ఆరు నెలలు ఇలాగే ఉంటా అని సిఎం డైరక్ట్ హెచ్చరికలు పంపించారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఎక్కడ ఉన్నాడంటూ ఆరా తీశారు. శిద్ధా రాఘవరావు గాల్లోనే ఉన్నారని మండిపడ్డారు. తాడిపత్రి ఎమ్మెల్యే జెసి. ప్రభాకర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ కు రాకపోవడం పై అసహనం వ్యక్తం చేస్తూ సీనియర్లు కూడా ఇన్ని సార్లు చెప్పించుకుంటే ఎలా అని నిలదీశారు. అతిశయం, అహంభావం పనికిరాదని, ఎప్పటికప్పుడు ప్రజాబిప్రాయం తెప్పించుకుంటున్నానని, అన్ని నివేదికలు కూడా బేరీజు వేసుకుంటున్నానని ఎప్పుడు కట్ చేయాలో అప్పుడు కట్ చేస్తానని హెచ్చరించారు.
సరైన స్థానంలో సరైన వ్యక్తులనే పెడతానని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల్లో పార్టీ పట్ల ఆదరణ బాగుందని, కార్యకర్తల్లో ఉత్సాహం ఉందని, లోపం ఎక్కడైనా ఉందంటే అది నాయకుల్లోనేనని చంద్రబాబు నిర్మోహమాటంగా చెప్పారు. చంద్రబాబులో వచ్చిన మార్పు చూసి పార్టీ నేతలు ఆశ్చర్యపోయారు. ఎన్నికల విషయంలో నిర్లక్ష్యంగా ఉండటం వల్ల మూల్యం చెల్లించుకునే పరిస్థితి రావడం వల్లే ఇలా సీరియర్ అయ్యారన్న భావన పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.