`ఎన్టీఆర్` ఆడియో ఫంక్షన్‌కి ఎన్టీఆర్ వస్తాడా? జూనియర్‌కి ఆహ్వానం అందుతుందా? పిలిచినా తాను రాగలడా? ఇవే ప్రశ్నలు అభిమానుల్ని తలచి వేశాయి. ఎన్టీఆర్‌ని అసలు పిలవలేదని కొందరు, పిలిచినా రాలేడని ఇంకొందరు.. ఇలా రకరకాల ఊహాగానాలు వ్యాప్తి చెందాయి. వాటికి తెరలు దించుతూ.. `ఎన్టీఆర్` పాటల వేడుకకు జూనియర్ వచ్చేశాడు. ఎప్పటిలా ఉద్వేగ భరితంగా మాట్లాడాడు. తాను ఈ కార్యక్రమానికి ఓ కుటుంబ సభ్యుడిలా రాలేదని, ఓ తెలుగువాడిగా వచ్చానని చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ స్సీచ్ ఈ విధంగా సాగింది.
“బాబాయ్‌ని చూస్తుంటే పెద్దాయన గుర్తొస్తున్నారు. ఆ మహా మనిషి కుటుంబంలో నేనూ ఓ వ్యక్తిని అని చెప్పుకోవడం గర్వకారణం. కానీ ఈ కార్యక్రమానికి నేను ఓ తెలుగువాడిగా మాట్లాడడానికి వచ్చా. చిన్నప్పుడు తెలిసీ తెలియని వయసులో ఆ మహా మనిషిని `తాతయ్యగారూ` అని సంబోధించా. ఆ తరవాత.. `రామారావు గారు.. అన్నగారు` అని సంబోధించా. ఆయన ఓ కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు. ప్రతీ కుటుంబానికీ చెందిన ఓ ధృవతార. ఆయన గురించి ఎన్నో కథలు విన్నా. ఎంత విన్నా.. ఆయన చరిత్ర గురించి చాలా మిగిలిపోయి ఉంటుంది. రామాయణం రాసే ముందు.. ఎవరో ఒక వ్యక్తి వాల్మీకిని అడిగి ఉంటారేమో. అయ్యా.. నిలువెత్తు ధర్మంతో ఏ మానవుడూ ఈ భూమ్మీద లేడా? అని. అప్పుడు వాల్మీకి శ్రీరాముడ్ని చూపిస్తూ రామాయణం రాశారు. ఆయన అవతారం చాలించాక. మళ్లీ అలాంటి ధర్మమూర్తిని మనం చూడలేమా? అని తెలుగువాళ్లంతా అడిగి ఉంటారు. ఆ ఆర్తనాదంలోంచి, ఆ శ్రీరాముడి కటాక్షంతోనే నిమ్మకూరులో ఓ ధృవతార వెలిసింది. ఎన్టీఆర్ ఓ గొప్ప తండ్రే కాదు.. ఓ గొప్ప బిడ్డే కాదు. ఓ నటుడే కాదు, నాయకుడే కాదు.. వీటన్నింటికంటే ముఖ్యం.. తెలుగువాళ్లు అని కూడా సంబోధించని రోజుల్లో `ఇదిరా తెలుగువాడి ఖ్యాతి..` అని తొడగొట్టిన మహనీయుడు. ఈరోజు తెలుగువాళ్లమని మనం గర్వంగా చెప్పుకుంటున్నామంటే.. నందమూరి రామారావుగారు కారణం. ఇది మాకు తెలిసిన చరిత్ర. రేపొద్దుట మా పిల్లలు మా గురించి అడిగితే.. `అలాంటి ధర్మమూర్తి ఇంకా పుట్టలేదేమో కానీ, మా తాత గురించి మీ తాత చేసిన సినిమా ఉంది..` అని ఈ సినిమా చూపిస్తా. ఆ మహానుభావుడి చరిత్ర మా తరువాతి తరానికి కూడా తీసుకెళ్తున్నందుకు బాబాయ్ ని ఎంత పొగిడినా తక్కువే. ఆయన నటించిన సినిమాలు చూశా. కానీ మొదటిసారి… ఆయనలో మా తాతగారిని చూసుకున్నా. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకోవడం లేదు. ఎందుకంటే విజయం సాధించాకే ఈ సినిమా మొదలంది,. చరిత్రకు విజయాలు అపజయాలు ఉండవు. చరిత్ర సృష్టించడమే ఉంటుంది. బాబాయ్ కలకు చేదోడు వాదోడుగా నిలిచిన క్రిష్ నాకెంతో ఆప్తమిత్రడు. గౌతమి పుత్ర శాతకర్ణి తరవాత మళ్లీ ఓ గొప్ప కథని అందిస్తున్నారు“ అన్నాడు ఎన్టీఆర్.