భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి, ఏపీ వ్యవహారాలను దత్తత తీసుకున్న రామ్మాధవ్.. ఇప్పుడు ఎన్నికల హామీల గురించి మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అయితే.. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిందో.. అప్పటి నుంచి ఏపీ బీజేపీ వ్యవహారాలను చూస్తున్నప్పటికీ… ఇప్పటి వరకూ ఆయన.. విభజన హామీల గురించి ఒక్క మాట మాట్లాడటం కానీ.. కేంద్రం నుంచి.. క్లియరెన్స్ ఇప్పించే విషయంలో కానీ.. మాట సాయం కూడా చేయలేదు. అయితే.. బీజేపీ తరపున పరోక్ష వ్యవహారాలను చక్క బెడుతున్నారన్న ప్రచారం జోరుగానే సాగుతోంది. ఇలాంటి సమయంలో.. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఆయన ఎన్నికల హామీల గురించి మాట్లాడుతున్నారు. ఉత్తరాంధ్ర బీజేపీ కార్యకర్తల సమావేశలో పాల్గొని.. ఎన్నికల కంటే ముందే రైల్వేజోన్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.
రైల్వేజోన్ అనేది.. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల డిమాండ్. అయితే నాలుగేళ్లుగా దీనిపై నాన్చినాన్చి..అనేక సార్లు సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులోనూ అఫిడవిట్ వేసింది. విశాఖ ఎంపీ, విశాఖ ఎమ్మెల్సీ లాంటి పదవులను… బీజేపీ.. రైల్వేజోన్ ప్రధాన హామీగానే గెలుచుకుంది. తీరా..అసలు సాధ్యం కాదని.. బుకాయించడం ప్రారంభించింది. ఓ సారి ఒడిషా అభ్యంతరం చెప్పిందని.. మరోసారి లాభదాయకం కాదని.. రకరకాల కారణాలు చెప్పింది. దీంతో.. టీడీపీ నేతలు.. తీవ్ర స్థాయిలో పోరాటం చేశారు. అయినప్పటికీ చలించలేదు. ఇప్పుడు హఠాత్తుగా రామ్మాధవ్.. ఉత్తరాంధ్ర కార్యకర్తలను బుజ్జగించే ప్రయత్నం చేశారు.
వచ్చే నెల ఆరో తేదీన… ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీ పర్యటనకు.. రానున్నారు. పార్టీ తరపున జరిగే బహిరంగసభలో పాల్గొనబోతున్నారు. ఆ సమావేశంలో ఏపీకి ఏమిచ్చామో చెప్పాల్సిన పరిస్థితి ఉంది. కేంద్ర విద్యాసంస్థలు ఇచ్చామని… చెప్పుకోవచ్చు కానీ… ప్రధానంగా ప్రత్యేకహోదా, రైల్వేజోన్, స్టీల్ ఫ్యాక్టరీ, పోర్టు లాంటివి.. ప్రజల్లోకి వెళ్లిపోయాయి. అలాగే.. ఢిల్లీకి మించిన రాజధాని అనే మాట కూడా చెప్పారు. వాటన్నింటిపై స్పందించకపోతే విమర్శలు వస్తాయి. ఇలా చేస్తాము అని చెప్పడానికి రామ్ మాధవ్.. మోడీ పర్యటనకు ముందుగా.. జిల్లాల పర్యటనలు జరిపి పార్టీ క్యాడర్ను సంతృప్తి పరిచే ప్రయత్నం చేస్తున్నారని భావిస్తున్నారు. నిజంగానే రైల్వేజోన్ ప్రకటిస్తే ప్రజలు హర్షిస్తారు. లేకపోతే.. మరో మోసం అనుకుని ప్రజలు సర్దుకుపోతారు. అంతకు మించి.. బీజేపీని చేయడానికి కూడా ఆ పార్టీకి ఏపీలో ఏమీ లేదు.