బీజేపీయేతర కూటమి ప్రధానమంత్రి అభ్యర్థి విషయంలో జరుగుతున్న రచ్చకు…టీడీపీ అధినేత చంద్రబాబు పులిస్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. బీజేపీ వ్యతిరేక కూటమిలో ప్రధాని అభ్యర్థిగా ఎవర్నీ నిర్ణయించలేదని, రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా మేం సమర్థించలేదని ప్రకటించారు. ఎన్నికల తర్వాతే ప్రధాని ఎవరనేదానిపై నిర్ణయానికి వస్తామని చెప్పారు. విశాఖలో నిర్వహించిన “ఇండియా టుడే” సదస్సులో స్పష్టం చేశారు. అదే సమయంలో వచ్చే సారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయలాంటే.. బీజేపీ, కాంగ్రెస్ లలో ఏదో ఒకటి లేకుండా సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. వాటిలో ఏదో ఓ పార్టీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయడమో.. లేదా ఆ పార్టీకి మద్దతివ్వాల్సి రావడమో చేయాల్సి ఉంటుందన్నారు. జాతీయ స్థాయి ప్రయోజనాల కోసమే బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ కోసం ప్రయత్నిస్తున్నారు… తెలంగాణ కూటమి ఆ కోణంలోనిదేనన్నారు.
బీజేపీని వ్యతిరేకిస్తున్న మమతా బెనర్జీ, అఖిలేష్, మాయావతి కాంగ్రెస్ తో కలిసి పోరాటానికి సిద్ధమే కానీ… రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించడానికి మాత్రం ససేమిరా అంటున్నారు. అదే సమయంలో… వీరందరికీ ప్రధానమంత్రి పదవిపై ఆశలు ఉన్నాయి. మమతా బెనర్జీ, మాయావతి, ములాయం అవకాశం వస్తే ప్రధాని పదవి పొందాలనుకుంటున్నారు. అలాంటి అవకాశం.. కర్ణాటకలో కుమారస్వామికి వచ్చినట్లు తమకు రాక పోతుందా అన్నదే వారి ఆలోచన. అందుకే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కూటమిలో చేరేందుకు సిద్ధపడటం లేదు. ఇలాంటి సమయంలో.. కాంగ్రెస్ కూటమి తరపున రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా డిసెంబర్ 16న డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ప్రకటించారు. దీనిపై మమతా బెనర్జీ సహా ఎస్పీ, బీఎస్పీలు కూడా అసంతృప్తి వ్యక్తం చేశాయి. దీంతో వీరిని చల్ల బరిచేదుకు చంద్రబాబు ప్రయత్నించారని అనుకోవచ్చు.
కూటమి ప్రధాన మంత్రి అభ్యర్థిగా తనను ప్రకటించాలనే ఉత్సాహన్ని కూడా రాహుల్ గాంధీ వ్యక్తం చేయడం లేదు. చంద్రబాబుతో జరిగిన సమావేశంలో కూడా.. రాహుల్ ప్రధానమంత్రి అభ్యర్థిత్వం గురించి చర్చించలేదు. అప్పట్లో మీడియా అడిగిన ప్రశ్నలకు కూడా… తను ప్రధానమంత్రి అభ్యర్థిని కానని.. ముందుగా బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని రాహుల్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు స్టాలిన్ ప్రకటనతో ఏర్పడిన ఇబ్బందిని చంద్రబాబు పరిష్కరించే ప్రయత్నం చేశారని అనుకోవచ్చు.