తిత్లీ తుఫాను తరువాత బాధిత ప్రాంతాల్లో ప్రతిపక్ష నేత కనడబలేదనీ, ఈ మధ్యనే తూర్పు గోదావరిలో తుఫాను వస్తే అక్కడా కనిపించలేదని విమర్శించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శ్రీకాకుళంలో జరిగిన ధర్మపోరాట దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత జగన్ ను విమర్శిస్తూ… రాష్ట్రానికి ఇబ్బందులు వస్తే ఆయన సహకరించరన్నారు. చివరికి, పులివెందులకు నీళ్లు తీసుకెళ్లి ఇస్తుంటే… అది కూడా ఇష్టం లేని వ్యక్తి ఈ ప్రతిపక్ష నేత అన్నారు. కడప జిల్లాలో ఉక్కు కర్మాగారానికి ఈనెల 27న శంకుస్థాపన చేస్తున్నామన్నారు. కేంద్రం సహకరించకపోయినా పూర్తి చేసే బాధ్యత తనదన్నారు. ఇదే ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్న జగన్మోహన్ రెడ్డి.. కేంద్రంపై ఒక్కమాట మాట్లాడరనీ, విమర్శించరనీ, తనపై విమర్శలు చేస్తారన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస పోటీ చేస్తే వాళ్లని సమర్థిస్తారన్నారు. అక్కడి ఎన్నికల్లో తెరాస గెలిస్తే సంబరాలు చేసుకుంటున్న కోడికత్తి పార్టీ నాయకుడు ఈ జగన్ అంటూ చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. ‘ఆయన నాకేదో బర్త్ డే గిఫ్ట్ ఇస్తారని అంటున్నారు కేసీఆర్. ఏం తమ్ముళ్లూ.. ఆ గిఫ్ట్ తీసుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా..?’ అన్నారు. ఎవర్ని బెదిరించాలని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నారు. ఈ వైయస్సార్ కాంగ్రెస్ కీ, పవన్ కల్యాణ్ పార్టీకీ లాలూచీ రాజకీయాలు అవసరమనీ… తనకు కాదన్నారు చంద్రబాబు. కాంగ్రెస్ తో చాన్నాళ్లు పోరాటం చేశామనీ, కానీ ప్రస్తుతం దేశంలో మోడీ పాలన చూసిన తరువాత… అన్ని పార్టీలూ కలవాల్సిన ఒక అనివార్యత ఏర్పడిందన్నారు. మన రాష్ట్రానికీ, ఈ దేశానికి న్యాయం చేసే విధంగా ముందుకు వెళ్తున్నాననీ, ఈ ప్రయత్నానికి ఆశీస్సులు కావాలంటూ ప్రజలను కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. దేశంలోని అన్ని వ్యవస్థల్నీ ఒక్కోటిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి ప్రసంగంలో ఈసారి కేంద్రంపై విమర్శలతోపాటు, ప్రతిపక్ష పార్టీ గురించి కూడా గత సభల కంటే ఎక్కువగానే ప్రస్థావిస్తూ మాట్లాడారు. ఇంకోటి… టీడీపీ, కాంగ్రెస్ ల మధ్య పొత్తును రెండు పార్టీల మధ్య మాత్రమే అని చూడకుండా… దేశంలోని భాజపాయేతర పార్టీలను ఏకం చేసే ప్రయత్నంలో భాగంలో కాంగ్రెస్ కూడా తోడైందనే అభిప్రాయం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి. తెలంగాణ సీఎం చేసిన వ్యాఖ్యల్ని లైవ్ లో ఉంచుతూ… ఆయన ఇచ్చే గిఫ్ట్ తీసుకోవాలా వద్దా అంటూ ప్రజలనే ప్రశ్నించారు. పవన్, జగన్ ల వెనక కేసీఆర్ ఉందనే అభిప్రాయాన్నీ కొనసాగిస్తూ వస్తున్నారు. ఓరకంగా… ఎన్నికల సమయంలో టీడీపీ ప్రచారానికి అవసరమయ్యే అజెండాను ఇప్పట్నుంచే సెట్ చేసుకునే దిశగా ఆయన ప్రసంగం ఉందని చెప్పొచ్చు.