వచ్చేసింది గుర్తు..! వచ్చేసింది..! జనసేనకు ఎన్నికల గుర్తు వచ్చేసింది..! పార్టీ పెట్టి ఐదేళ్లయినా… పార్టీకి గుర్తంటూ లేని బాధను.. ఎన్నికల సంఘం తీర్చేసింది. ప్రత్యేకంగా దరఖాస్తు పెట్టుకోకపోయినా… ఓ గుర్తింపు లేకపోయినా… “గ్లాస్” గుర్తును కేటాయిస్తూ.. అధికారిక ప్రకటన చేసేసింది. ఈ విషయం జనసేన కంటే ముందే.. మీడియాకు తెలిసింది. ఆ తర్వాత జనసేనకు తెలిసింది. తెలుగు 360 అందరి కంటే ముందుగా.. ఈ విషయాన్ని ప్రకటించింది. ఆ తర్వాత జనసేన పార్టీ అధికారిక ట్విట్టర్లో ధృవీకరించింది.
నిజానికి జనసేన ఎన్నికల గుర్తు అనేది చాలా పెద్ద పజిల్‌గా మారింది. 2014 ఎన్నికల కంటే ముందే… పార్టీ పెట్టినప్పటికీ.. ప్రత్యేకంగా ఎన్నికల సంఘం వద్ద గుర్తింపు కోసం ప్రయత్నించలేదు. గుర్తింపు సాధించి ఉంటే.. ఎప్పుడో “గుర్తు” వచ్చి ఉండేది. కానీ.. ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల గుర్తు పెట్టుకోలేకపోయారు. 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత చాలా ఎన్నికలొచ్చాయి. మున్సిపల్, ఉపఎన్నికలు జరిగాయి. కానీ పవన్ ఎక్కడా పోటీ చేయలేదు. దాంతో “గుర్తు” సమస్య రాలేదు. ఇప్పటికీ.. గుర్తు లేదనుకోండి.. నామినేషన్లు వేసిన తర్వాత ఏదో గుర్తు ప్రకటిస్తారు.. గుర్తు లేకుండా ఎన్నికలకు వెళ్లరు కాబట్టి… అలా ఉండిపోయినట్లు ఉన్నారు. కానీ.. ఎన్నికల సంఘం మాత్రం.. తమ వద్ద రిజిస్టర్ చేసుకున్న పార్టీలకు.. నిబంధనల ప్రకారం గుర్తులు కేటాయించింది. అందులో భాగంగా జనసేనకు గ్లాస్ వచ్చింది.
సాధారణంగా..రాజకీయ పార్టీలు తమ విధానాలకు అనుగుణంగా ప్రజల్లోకి వెళ్లే గుర్తును కేటాయించాలని… ఈసీ వద్ద ప్రయత్నాలు చేసుకుంటారు. విజ్ఞాపన పత్రాలు పెట్టుకుంటాయి. కానీ జనసేన మాత్రం అలాంటి ప్రయత్నాలు చేయలేదు. గతంలో జనసేన గుర్తు విషయంలో… పడిన ఇబ్బందులు కళ్ల ముందు కనిపించినా… వారు లైట్ తీసుకున్నారు. అయితే గ్లాస్ గుర్తు… జన బాహుళ్యంలోకి వెళ్లేది. చూడటానికి అచ్చంగా “టీ గ్లాస్” లానే ఉంది కాబట్టి మంచిది. ఇంకా పెద్ద గ్లాస్ కేటాయిస్తే ప్రాబ్లం అయ్యేది. అదేం గ్లాస్ అని ఎవరైనా అడిగితే చెప్పుకోవడానికి ఇబ్బంది అయ్యేది. ఇప్పుడా సమస్య లేదు. మొత్తానికి జనసైనికలకు ఓ చింత తీరింది. తమకంటూ.. ఓ గుర్తింపు వచ్చిందని వారు సంతోషపడుతున్నారు.