టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. జనవరిలోనే వంద సీట్లకు అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించబోతున్నారు. ఈ మేరకు.. ఇప్పటికే మూడు నెలల నుంచి కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థులకు ముందస్తు సమాచారం కూడా ఇచ్చారు. 30 నుంచి 40 మంది అభ్యర్థుల్ని మార్చబోతున్నట్లు సూచనలు ఇచ్చారు. సీటు కోల్పోయే వారికి బలమైన సూచనలు కూడా పంపారు. ఉన్న వారు..ఉండండి.. లేకపోతే లేదన్న పద్దతిలో వ్యవహరించడం ప్రారంభించారు. అంత వరకూ బాగానే ఉంది కానీ.. తొలి జాబితాలో… చంద్రబాబునాయుడుకు చోటు దక్కుతుందా..? అనేది టీడీపీ నేతల్లో వస్తున్న సందేహం. ఎందుకంటే… ఈ సారి…తనయుడు లోకేష్‌కు సేఫ్ సీటును ఎలాట్ చేయాల్సి ఉంది.
చంద్రబాబు తను దశాబ్దాలుగా గెలుస్తూ వస్తున్న కుప్పం సీటును.. లోకేష్‌కు అప్పగించడం దాదాపు ఖాయమే. గత పదిహేనేళ్ల నుంచి చంద్రబాబు విపక్ష, అధికార హోదా విధుల్లో బిజిగా ఉన్న సమయంలో.. కుప్పం బాధ్యతలను లోకేషే చూసుకున్నారు. అక్కడి క్యాడర్ మొత్తం ఆయనకు బాగా తెలుసు. అందుకే చంద్రబాబు.. కుప్పం సీటును లోకేష్‌కు కేటాయించనున్నారు. మరి తాను ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు…?. లోకేష్ రాయలసీమ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి… ఈ సారి చంద్రబాబు… కోస్తాలోని.. అదీ కూడా…. సీఆర్డీఏ పరిధిలోని ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేయవచ్చన్న ప్రచారం ప్రారంభమయింది.
సీఆర్డీఏ పరిధిలో గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్ని కీలక నియోజకవర్గాలు ఉన్నాయి. ఇవన్నీ టీడీపీకి కంచు కోటలే. వీటిలో ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి.. చంద్రబాబు ఆసక్తి చూపుతున్నారని.. పార్టీలోని కొంత మంది ముఖ్య నేతలు.. అంతర్గత సంభాషణల్లో చెబుతున్నప్పటికీ..ఏ సీటు నుంచి పోటీ చేయబోతున్నారన్నదానిపై మాత్రం క్లారిటీ లేదు. చాలా నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన అభ్యర్థులు ఉన్నారు. వారిని కాదని… చంద్రబాబు పోటీ చేయడం కూడా ఇబ్బందికరమే. చంద్రబాబు పోటీ చేస్తానంటే.. వారు ఆహ్వానించవచ్చు కానీ… చంద్రబాబు ఆలోచన మాత్రం అది కాకపోవచ్చు.. నాయకత్వ సమస్య ఉన్న మంగళగిరి లాంటి స్థానాన్ని ఆయన ఎంపిక చేసుకున్నా.. ఆశ్చర్యం లేదంటున్నారు. మొత్తానికి చంద్రబాబు సీట్ల కసరత్తు పూర్తి చేసే దశలో ఉన్నారు కాబట్టి.. కచ్చితంగా తన నియోజకవర్గంపైనా కసరత్తు చేసే ఉంటారు…! అది ఏమిటన్నది తేలాల్సి ఉంది..!