పదకొండో తేదీన ఎన్నికల ఫలితాలొచ్చాయి. కేసీఆర్ ఆ తర్వాత మూడు రోజులకే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక పద్దెనిమిదో తేదీన అసెంబ్లీని పెడతారని.. సభ్యుల ప్రమాణ స్వీకారాలుంటాయని.. మంత్రివర్గాన్ని విస్తరిస్తారని… బోలెడన్ని కథనాలొచ్చాయి. కానీ 23వ తేదీ వచ్చింది. 26వ తేదీ వరకూ.. కేసీఆర్ హైదరాబాద్ లోనే ఉండటం లేదు. అంటే.. ఈ నెలలో.. ఆ ప్రమాణస్వీకారాలు, మంత్రివర్గ విస్తరణలు లేనట్లేనన్నమాట. మరి ఎప్పుడు చేస్తారు..? ఎందుకు ఆలస్యం చేస్తున్నారు..?. దీని వెనుక వ్యూహం ఉందా.. అంటే.. ఉందనే చెప్పుకోవాలి. తెలంగాణ అసెంబ్లీలో.. ప్రమాణం చేసేవారెవరైనా.. టీఆర్ఎస్ లేదా.. ఎంఐఎం మాత్రమే.. ఉండాలనేది..ఆ వ్యూహం కావొచ్చన్న అంచనా వినిపిస్తోంది.
ఎన్నికల్లో 88 సీట్లలో విజయం సాధిచిన టీఆర్ఎస్.. ఇండిపెండెంట్లుగా గెలిచిన ఇద్దర్ని… చేర్చుకుంది. వైరా నుంచి గెలిచిన రాములు నాయక్, రామగుండం నుంచి గెలిచిన కోరుకంటి చందర్ టీఆర్ఎస్లో చేరారు. దీంతో టిఆర్ఎస్ బలం 90 కి చేరింది. అయినా వంద సీట్లు గెలుస్తామని టార్గెట్ పెట్టుకున్న గులాబీ దళం…..ఇప్పుడు ఆ సీట్లను గెలిచిన వాళ్లను పార్టీలో చేర్చుకోవడం ద్వారా సాధించాలనుకుంటోంది. ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి 19 మంది, టీడీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు. కాంగ్రెస్కు చెందిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు వస్తారని.. టీడీపీ నుంచి గెలిచినా.. ఇద్దరూ చేరిపోతారని.. టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. దీనికి సంబంధించిన చర్చలు తుది దశలో ఉన్నాయని.. అవి పూర్తి కాగానే… వారందర్నీ కారెక్కించి.. ఆ తర్వాత మిగతా కార్యక్రమాలు చేపడతారని అంటున్నారు.
ఇప్పటికే శాసనమండలిలో విపక్షం లేకుండా చేసిన టీఆర్ఎస్ ఇప్పుడు శాసనసభలోనూ అదే సీన్ రిపీట్ చేయాలని నిర్ణయించుకుంది. శాసనసభలో కూడా.. ఎవరికీ ప్రతిపక్ష హోదా ఇవ్వాలనుకోవడం లేదు. అందుకే.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందర్నీ.. చేర్చుకున్న తర్వాత.. అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఇక దీనికి తిరుగుండకపోవచ్చు..! మరో శాసనసభాపక్షం విలీనం లేకుండా.. అసలు అది ఏర్పడకుంండానే… కేసీఆర్ పని పూర్తి చేస్తారన్నమాట..!