అక్షరమే ఆయుధంగా చేసుకుని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ప్రజాస్వామ్యం కోసం పోరాటం ప్రారంభించారు. తెలంగాణలో ప్రజాస్వామ్య హననం జరుగుతోందని గుర్తించారు. తన వారాంతపు ఆర్టికల్.. కొత్త పలుకు ద్వారా.. ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతున్న కేసీఆర్ పై ఓ రకంగా యుద్ధమే ప్రకటించారు. ఇంతకీ… తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదని ఆర్కే ఎందుకనుకుంటున్నారు ..? కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసుకోడం ద్వారా… టీఆర్ఎస్.. ప్రతిపక్షాన్ని లేకుండా చేసి.. రాజ్యం చేయాలనుకుంటోంది..కదా..అదే ప్రజాస్వామ్యానికి వచ్చిన పెను మప్పు అని ఆర్కే చెబుతున్నారు.
ఈ వారం కొత్త పలుకులో.. పూర్తిగా.. కేసీఆర్ రాజకీయ వ్యూహాల్ని చీల్చి చెండాడారు ఆర్కే. “నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు..”అనే పదంతోనే “కొత్తపలుకు” ప్రారంభించి తన ఉద్దేశం ఏమిటో చెప్పకనే చెప్పారు. పార్టీల విలీనం అనేది వికృతక్రీడగా తేల్చారు.ఫిరాయింపులను ప్రోత్సహించడం, ప్రత్యర్థులను అనైతికంగా విలీనం చేసుకోవడం చట్ట విరుద్ధం అని తేల్చారు. ఇప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహించవలసిన అవసరం ఏమొచ్చింది అన్న ప్రశ్నకు కేసీఆర్ సమాధానం చెప్పవలసి ఉంటుందని తేల్చేశారు. కేసీఆర్ తెలంగాణలోని ఊళ్లల్లో పెత్తందార్ల వైఖరిని ప్రదర్శిస్తున్నారని ఆర్కే చెబుతున్నారు. ఇప్పటికే మీడియాకు.. కేటీఆర్ హెచ్చరికలు జారీ చేసి… ఎలా నడుచుకోవాలో క్లాస్ పీకారు. అందుకే.. తెలంగాణలో ప్రతిపక్షాలు గానీ, మీడియా గానీ, మరెవరైనా గానీ బతికి బట్టకట్టాలంటే అధికారపార్టీకి గులాంగిరీ చేయాల్సిందేనా? అనే ఆవేదన కూడా .. తన ఆర్టికల్లో ఆర్కే వ్యక్తం చేశారు.
కొత్త పలుకులో కేసీఆర్కు.. కొన్ని హెచ్చరికలు పంపించారు.. ఆర్కే. అధికారం శాశ్వతం కాదని .. ప్రజలు ఇస్తేనే అది వచ్చిందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని.. సూచనలు పంపించారు. ప్రజాభిప్రాయం ఎప్పుడూ స్థిరంగా ఉండదని చెబుతూ.. అనేక ఉదాహరణలు కూడా రాసుకొచ్చారు. కేసీఆర్ చర్యలు ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా ఉన్నాయని… ఘాటుగా స్పందించారు. శాసనమండలిలో కాంగ్రెస్పార్టీని విలీనం చేసుకోవడం అనే చట్టవిరుద్ధ చర్యను న్యాయస్థానాలైనా అడ్డుకుంటాయని ఆర్కే తన వ్యాసంలో ఆశించారు. ఈ వారం.. కొత్త పలుకులోని విశేషం ఏమింటే.. పురాణాల్లోని..కొన్ని ఇతిహాసాలను గుర్తు చేసి.. కేసీఆర్ను దుష్ట క్యారెక్టర్లతో పోల్చి.. అలా పతనం అవుతారన్న హెచ్చరికలు పంపడం. చివరికి ధర్మో రక్షతి రక్షిత: పేరుతో ముగించారంటే… తెలంగాణ రాజకీయ పరిణామాలతో ఆయన పూర్తిగా కలత చెందాడని.. పాఠకులు అర్థ చేసుకోవచ్చు.