టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఫెడరల్ ఫ్రంట్ పెడతానంటూ పర్యటనలు ప్రారంభించబోతున్నారు. ముందుగా ఆయన ఒడిషా వెళ్తున్నారు. అక్కడ బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్‌తో చర్చలు జరుపుతారు. ఇప్పటి వరకూ కేసీఆర్ తాను ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్‌లో తాను తప్ప ఎవరూ లేవు. కచ్చితంగా వస్తారని చెప్పుకుంటున్న నేతలు కూడా లేరు. అయితే.. అటు కాంగ్రెస్‌కు.. ఇటు బీజేపీకి దూరంగా ఉన్న పార్టీలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఒకటి బిజూ జనతా దళ్. అందుకే మొదటగా ఈ పార్టీ మీద గురి పెట్టారు .. కేసీఆర్.
కేసీఆర్ కొద్ది రోజుల కిందట… ముందస్తు ఎన్నికల్లో గెలవకు ముందు ఓ సారి ఫెడరల్ టూర్స్ నిర్వహించారు. ఆ సమయంలో కొంత మందిని ప్రగతి భవన్‌కు పిలిపించుకున్నారు.. మరికొంత మంది వద్దకు తానే వెళ్లాడు. ఆ సమయంలో.. ఒడిషాకు కూడా వెళ్లబోతున్నారని ప్రచారం జరిగింది. కానీ.. బీజేడీ క్యాంప్ నుంచి ఓ క్లారిఫికేషన్ మీడియాకు వచ్చింది. అదేమిటంటే.. కోణార్క్ ఆలయానికి కుటుంబ సమేతంగా వస్తామన్నారని సమాచారం ఇచ్చారు.. ఆహ్వానించామే కానీ.. కేసీఆర్‌తో ఎలాంటి ఫెడరల్ ఫ్రంట్ చర్చలు జరపడం లేదనేది.. బీజేడీ చెప్పిన విషయం. దాంతో.. అక్కడికే ఆ టూర్ ఆగిపోయింది. ముందస్తుకు వెళ్లిన కేసీఆర్ విజయం సాధించారు. ఇప్పుడు భువనేశ్వర్ వెళ్తున్నారు. ఒడిషా సీఎం ఆతిథ్యం తీసుకుంటారు. ఆలయాలూ వెళ్తారు..? మరి ఫెడరల్ ఫ్రంట్ చర్చల సంగతేమిటి..?
ఈ విషయం బిజూ జనతాదళ్ వర్గాలు ఏ మాత్రం స్పందించడం లేదు. ఎందుకంటే.. జాతీయ పార్టీలకు.. జాతీయ రాజకీయాలకు.. బిజూ జనతాదళ్ ఎప్పుడూ దూరమే. కేసీఆర్ రెండో సారి మాత్రమే గెలిచారు. కానీ.. ఒడిషాలో.. నవీన్ పట్నాయక్ గత పందొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్నారు. వరుసగా నాలుగు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఐదో సారి ఎడ్జ్‌లో ఉన్నారు. లోక్ సభ సీట్లలో ప్రతీ సారి స్వీప్ చేస్తూనే ఉన్నారు. కానీ ఎప్పుడూ.. తానో గొప్ప మేధావినని… ఇంకోటని అనుకుని.. దేశ రాజకీయాల్లోకి వెళ్లాలని అనుకోలేదు. ఇప్పుడు కేసీఆర్ వెళ్లినంత మాత్రాన.. ఆయనతో కూటమిలో చేరిపోతారన్న అంచనాలు కూడా ఒడిషా రాజకీయవర్గాల్లో లేవు. కేసీఆర్ టూర్.. ఓ అధ్యాత్మిక పర్యటనలా సాగిపోతుంది… అంతే అంటున్నారు.. అక్కడి లీడర్స్..!