ఫెడరల్ ఫ్రంట్ చర్చల కోసం.. భువనేశ్వర్ వెళ్లిన కేసీఆర్.. నవీన్ పట్నాయక్‌తో చర్చలు జరిపారు. సమావేశం తర్వాత.. బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ చాలా … చాలా సింపుల్‌గా మాట్లాడారు. తాము చాలా విషయాల గురించి మాట్లాడుకున్నామన్నారు. అయితే .. లోక్‌సభ ఎన్నికల గురించి ఇప్పుడే ఏం మాట్లాడలేమని తేల్చి చెప్పేశారు. భావసారూప్య పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు కానీ.. తన పార్టీకి.. కేసీఆర్ చెప్పే ఫెడరల్ ఫ్రంట్ కి భావసారూప్యం ఉందో లేదో హింట్ ఇవ్వలేదు. మహిళా రిజర్వేషన్ల అంశం, తెలంగాణలో రైతుల కోసం అమలు చేస్తున్నపథకాలపై చర్చించామని తెలిపారు. ఇంత చేసినా.. నవీన్ పట్నాయక్ ఫెడరల్ ఫ్రంట్ గురించి మాత్రం.. చిన్న ప్రస్తావన కూడా చేయలేదు.
అయితే కేసీఆర్ మాత్రం.. దేశం కోసం ఏదైనా చేయాలనే అభిప్రాయాన్ని నవీన్ పట్నాయక్ వెలిబుచ్చారని తెలిపారు. ప్రాంతీయ పార్టీల నేతలు ఏకం కావాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పుకొచ్చిన కేసీఆర్… మరికొంత మంది జాతీయస్థాయి నేతలతో చర్చలు జరుపుతామని వెల్లడించారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చర్చలు ప్రారంభ దశలోనే ఉన్నాయని, మరోసారి నవీన్ పట్నాయక్‌తో సమావేశం అవుతానని చెప్పుకొచ్చారు. తమ కలయిక దేశానికి మేలు చేస్తుందని ఆశాబావం వ్యక్తం చేశారు. తాము ఎవరికీ బీ-టీమ్ కాదు, తమ సొంత టీమ్ అని చెప్పుకొచ్చారు. విచిత్రం ఏమిటంటే.. మహిళా బిల్లుకు మద్దతిస్తానని కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ గత ఎన్నికల్లో నాలుగు సీట్లు కూడా మహిళలకు కేటాయించ లేదు.
భువనేశ్వర్‌లోని సీఎం అధికారిక నివాసంలో బస చేస్తారు. 24న ఉదయం రోడ్డు మార్గం ద్వారా కోణార్క్ సూర్య దేవాలయం, పూరీ జగన్నాథ దేవాలయాలను సందర్శిస్తారు. పూజల అనంతరం భువనేశ్వర్ చేరుకుంటారు. అక్కడి నుంచి కోల్‌కతా వెళ్తారు. సాయంత్రం 4 గంటలకు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీతో సమావేశం అవుతారు. కేసీఆర్.. కొద్ది రోజులుగా హడావుడి చేస్తున్నట్లుగా… జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు దిశగా.. పడిన తొలి అడుగు అంత గొప్పగా సక్సెస్ కాలేదు. నవీన్ పట్నాయక్ నైజం.. ఢిల్లీకి దూరంగా ఒంటరిగా ఉండటమే. అదే ఫాలో అవడానికి ఆయన సిద్ధపడ్డారని… కేసీఆర్ భేటీ తర్వతా ఆయన మాటలు చూస్తే అర్థమవుతోందని .. రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.