ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకతను సాక్షి మీడియా.. ఏపీపై వ్యతిరేకతగా మార్చుకుననట్లుగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి లాంటి ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఆ పత్రిక వ్యవహరిస్తున్న తీరు ఇలాగే ఉంది. పోలవరం ప్రాజెక్ట్ పనులు.. వైఎస్ఆర్ హయాంలోనే 60, 70 శాతం పూర్తయ్యాయని ఆ పార్టీ నేతలు చెప్పుకున్నప్పుడు… ప్రధాన వార్తలుగా రాసే సాక్షి దినపత్రిక… వాస్తవంగా జరుగుతున్న పనులను కూడా తక్కువ చేసి చూపే ప్రయత్నాన్ని మొదటి నుంచి చేస్తోంది. ప్రాజెక్ట్ కీలక పనులు ప్రారంభమైనప్పుడో.. పూర్తయినప్పుడో… తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. తాజాగా.. ఈ రోజు పోలవరంలో గేట్ల బిగింపు ప్రారంభం కాబోతోంది. ఈ సందర్భంగా..” గేట్ షో” అనే కథనం ప్రచురించింది.
పోలవరంలో పనులేమీ జరగడం లేదన్నట్లుగా అర్థంలో రాసి.. ఊరకనే.. గేటు పెట్టి… చంద్రబాబు హడావుడి చేయబోతున్నారని.. మట్టి పనులు పూర్తి కాలేదనే అర్థంలో ఆ కథనం రాసుకొచ్చారు. పనులన్నీ ఇంకా పునాదిలోనే ఉన్నాయని తేల్చేశారు. ఒక్కో గేటు పెట్టడానికి అరవై రోజులు పడుతుందని.. ఆ లెక్కన… 48 గేట్లు పెట్టడానికి ఎన్నేళ్లు పడుతుందనే విచిత్రమైన లెక్కలు వేశారు. గేట్ల తయారీ ఇప్పటికే పూర్తయిందని… ఎక్కడా చెప్పలేదు. సమాంతరంగా పనులు జరిగితే.. రెండు నెలల్లో గేట్లు ఏర్పాటు చేయడం కూడా పూర్తవుతుందన్న విషయాన్ని చెప్పలేదు. కాఫర్ డ్యాం కానీ… మట్టి పనులు కూడా… దాదాపుగా పూర్తయిన విషయాన్ని దాచి పెట్టి… అసలు అవేమీ జరగలేదన్న విషయాన్ని చెప్పేందుకు తాపత్రయ పడింది. ఏపీ భవిష్యత్ ను మార్చే ప్రాజెక్టు పై … సాక్షి పత్రిక… తన రాజకీయ అవసరాల కోసం ఇంతగా ఎందుకు విషం చిమ్మాల్సి వస్తుందో పాఠకులకే అర్థం కాని పరిస్థితి.
అదే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయానికి వస్తే.. అక్కడ జరిగినా.. జరగకపోయినా మాత్రం.. వీర తాళ్లు వేస్తోంది. పోలవరం గేట్ల బిగింపును..అసలు పనులేమీ జరగని చందంగా ప్రజెంట్ చేస్తే పోలవరం ప్రాజెక్ట్ లో భాగంగా మేడిగడ్డ వద్ద నిర్మిస్తున్న ప్రాజెక్ట్ కోసం.. ఒక్క రోజే 16,722 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేయడాన్ని… ఓ గొప్ప, అరుదైన రికార్డుగా అభివర్ణించింది. దాని కోసం మొదటి పేజీలోనే పెద్ద కథనం రాసింది. ప్రభుత్వ తీరును అభినందించింది. … ఏపీలో పోలవరం ప్రాజెక్ట్ పై లేని పోని దుష్ప్రచారం చేయడం ఎందుకు…? కాళేశ్వరం ప్రాజెక్ట్ కు అవసరం లేకపోయినా.. అతి ప్రచారం కల్పించడం ఎందుకో..? సాక్షికే తెలియాలి. ఇవన్నీ చూసిన తర్వాత సాక్షి పత్రిక పాఠకుల కోసం కాకుండా.. ప్రజల కోసం కాకుండా.. సొంత ప్రయోజనాల కోసమే… పని చేసుకుంటుందనే విషయం మాత్రం స్పష్టం అవుతోంది. ఈ విషయంలో పాఠకులు రియలైజ్ అయితే.. ఇప్పటికే పతనం దిశగా ఉన్న సర్క్యూలేషన్… పాతాళంలోకి పోతుందేమో..?