`ఎన్టీఆర్` బయోపిక్‌కి దర్శకత్వం వహించే అవకాశం రాఘవేంద్రరావు దగ్గరకు కూడా వెళ్లింది. కానీ.. ఎందుకో పెద్దాయన సముఖత చూపించలేదు. ఎన్టీఆర్‌తో ఆయనకు చాలా అనుబంధం ఉంది. అయినా సరే – ఈ సినిమాకి దర్శకత్వం వహించాలని అనిపించలేదాయనకు. అయితే.. `ఒక్క షాట్కైనా దర్శకత్వం చేస్తా` అని ఓపెనింగ్ రోజున చెప్పారు. దర్శకేంద్రుడంతటివాడే ఆ మాట అన్నాడంటే.. క్రిష్ కూడా తలాడించాల్సిందే. కానీ `ఎన్టీఆర్` షూటింగ్ ముగింపు దశకు వచ్చేసింది. మరో రెండు మూడు రోజుల్లో గుమ్మడికాయ్ కూడా కొట్టేస్తారు. కానీ ఇంత వరకూ.. దర్శకేంద్రుడి కోరిక తీరలేదు. ఈ మూడు రోజుల్లో తీరుతుందన్న ఆశ లేదు. ఎందుకంటే.. ఇప్పుడు మిగిలినదంతా ప్యాచ్ వర్క్ మాత్రమే. కాకపోతే. .. రాఘవేంద్రుడి పాత్రలో.. తనయుడు ప్రకాశ్ నటించాడు. ఆ రకంగా ఈ సినిమాలో తన కుటుంబానికి, తన పాత్రకు స్థానం దక్కిందన్న సంతృప్తి మిగిలింది.