పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్సీలపై.. అనర్హతా వేటు వేసి.. కొత్తగా పార్టీ నేతలకు చోటివ్వాలనుకుంటున్న టీఆర్ఎస్ ముఖ్యనేతలకు..కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్లో కొండా మురళి, రాములు నాయక్, భూపతిరెడ్డి, యాదవరెడ్డిలపై.. అనర్హతా వేటు వేయాలని టీఆర్ఎస్ నేతలు ఇప్పటికే… శాసనమండలి చైర్మన్కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఇప్పటికే.. వారికి నోటీసులు జారీ అయ్యాయి. బుధవారం తర్వాత ఏ క్షణమైనా వారిపై అనర్హతా వేటు పడే అవకాశం ఉంది. ఈ లోపే.. కొండా మురళి తన పదవికి రాజీనామా చేశారు. శాసనమండలి చైర్మన్ ఆమోదించారు కూడా. ఇక.. మిగిలింది ముగ్గురు. వీరిలో ఒకరు రాములు నాయక్. ఈయన తనపై అనర్హతా వేటు వేయడం సాధ్యం కాదని చెబుతున్నారు.
రాములునాయక్ ను.. కేసీఆర్.. గవర్నర్ కోటాలో.. ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. ఆయన సమాజ సేవకుని కోటాలో.. సిఫార్సు చేశారు. ఆ కోణంలోనే ఆయనను గవర్నర్ నియమించారు. దీన్నే అస్త్రంగా చేసుకుని రాములు నాయక్.. పోరాటం ప్రారంభించారు. ఈ రోజు… శాసనమండలి ఛైర్మన్ ను కలిసి… తనకు వారం రోజుల గడువుతో నోటీసులు ఇచ్చారని… తనకు నాలుగు వారాల సమయం కావాలని కోరారు. తనను గవర్నర్ కోటాలో నియమించినందున.. దానికి సంబంధించి… డీటైల్స్ ను.. ప్రభుత్వం నుంచి ఆర్టీఏ చట్టం ద్వారా సేకరించడానికి తనకు ఆ సమయం ఇవ్వాల్సి ఉందన్నారు. కానీ స్వామిగౌడ్ మాత్రం.. సమయం ఇవ్వడానికి నిరాకరించారు.
నిజానికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అంటే.. పార్టీ కిందకు రారు. ఇప్పటి వరకూ వారు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కిందకు వస్తారా.. రారా అన్న చర్చ రాలేదు. ఎప్పుడూ.. ఇలాంటి పరిస్థితి రాలేదు. నేరుగా గవర్నర్ .. వివిధ రంగాల ప్రముఖుల పేరుతో అపాయింట్ చేసినందున.. పార్టీ తరపున కాదు కాబట్టి.. సహజ న్యాయసూత్రాల ప్రకారం… ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదు. కానీ.. అవకాశమే లేని కాంగ్రెస్ ఎల్పీని.. టీఆర్ఎస్లో విలీనం చేసిన శాసనమండలి చైర్మన్… ఈ విషయంలోనూ.. తన అధికారాన్ని పరిమితికి మించి ఉపయోగించుకునే అవకాశం ఉంది.