జాతీయ రాజకీయాలపైనే ప్రధానంగా చర్చించేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో, తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించిన తరువాత కేసీఆర్ ఫోకస్ అంతా ఢిల్లీ వైపే ఉంది! కాంగ్రెసేతర, భాజపాయేతర ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కేంద్రంలో అధికారంలోకి రావాలనే ప్రయత్నంలో భాగంగా ఆయన పర్యటనలు ప్రారంభించారు. మమతాతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
మమతా బెనర్జీతో భేటీ సందర్భంగా చాలా అంశాలు చర్చించామన్నారు. ఈ ప్రక్రియ మున్ముందు ఇంకా కొనసాగుతుందన్నారు. తన ప్రయత్నాలను నిన్నట్నుంచే ప్రారంభించాననీ, దాన్లో భాగంగా ఒడిశా ముఖ్యమంత్రిని కలిసి వచ్చా అన్నారు కేసీఆర్. ఎన్నికల్లో తాను మరోసారి గెలిచిన వెంటనే మమతా బెనర్జీ ఫోన్ చేసి అభినందించారని చెప్పారు. తమ భేటీలో రాష్ట్రాలకు సంబంధించిన అంశాలతోపాటు, జాతీయ రాజకీయాలపై కూడా చర్చ జరిగిందన్నారు. తమ చర్చలు మున్ముందు ఇంకా కొనసాగుతాయనీ, ఒక స్పష్టమైన ప్రణాళికతో తాము కొద్దిరోజుల్లోనే స్పష్టమైన ప్రకటన చేస్తామన్నారు. భాజపా, కాంగ్రెస్ ప్రమేయం లేని ప్రత్యామ్నాయ రాజకీయాల కోసమే మీరు చర్చించారా అంటూ విలేకరుల అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ… అది కేసీఆర్ మిషన్ కాదనంటూ చెప్పారు.
తన ఆలోచనా విధానాన్ని కొనసాగిస్తాననీ, ఇది ఏదో చిన్న విషయం కాదనీ, వెంటవెంటనే నిర్ణయాలు జరిగిపోవడానికి అన్నారు. ఈ దిశగా చర్చల ప్రక్రియ కొనసాగుతుందనీ, త్వరలోనే ఒక శుభవార్త చెబుతామనీ, ఆరోజున కేసీఆర్ విజన్ ఏంటనేది అర్థమౌతుందన్నారు. జాతీయ రాజకీయాలపై మమతా బెనర్జీతో చర్చించానని చెప్పారుగానీ… భాజపాయేతర, కాంగ్రెసేతర రాజకీయాలపైనే ప్రధానంగా చర్చలు సాగాయా అనేది కేసీఆర్ స్పష్టంగా చెప్పలేదు. చర్చలు కొనసాగుతాయని ముగించేశారు! నిజానికి, కాంగ్రెస్ భాజపాలను కాదనే పరిస్థితి ప్రస్తుతానికి తెరాసకు ఉందేమోగానీ… ఈ రెండు జాతీయ పార్టీల్లో ఏదో ఒకటి లేని ఢిల్లీ రాజకీయాలుంటాయనే అంశాన్ని ఇప్పటికిప్పుడు ఇతర రాష్ట్రాల్లోని పార్టీలు నమ్మే పరిస్థితి కొంత తక్కువగా కనిపిస్తోంది. పైగా, కేసీఆర్ మొదలుపెట్టిన ఈ ప్రయోగం ఎటువైపు వెళ్తుందా అనేది కొన్నాళ్లపాటు వారూ వేచి చూస్తారు కదా!