మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న తరువాత, అదే జోష్ ను కొనసాగిస్తున్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. దేశవ్యాప్తంగా మోడీ వ్యతిరేక పవనాలు జోరుగా ఉన్న వేళ… భాజపాయేతర పార్టీలను దగ్గర చేర్చుకునే ప్రయత్నం మరింత వేగవంతం చేశారు. దీన్లో భాగంగా మహారాష్ట్రలో ఎన్సీపీ, కాంగ్రెస్ ల మధ్య పొత్తు ఖరారైంది. ఆ రాష్ట్రంలో మొత్తం 48 లోక్ సభ స్థానాలకుగాను, 40 నియోజక వర్గాల పోటీకి సంబంధించి ఈ పార్టీల మధ్య అవగాహన కుదిరింది. నిజానికి, 2014 ఎన్నికల్లో కూడా 27 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల్ని బరిలోకి దింపింది. అప్పట్లో ఎన్సీపీ 21 చోట్ల పోటీ చేసింది. రాబోయే ఎన్నికల్లో కూడా ఎక్కడెక్కడ ఏయే స్థానాల్లో పోటీ చేస్తుందనే స్పష్టత కూడా ఆ రెండు పార్టీల మధ్య వచ్చేసింది. నలభై సీట్లలో సగం సగం పోటీ చేసేందుకు అంగీకారం కుదుర్చుకున్నాయి.
నిజానికి, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మధ్య కొన్ని భేదాభిప్రాయాలు వచ్చాయి. దాంతో ఈ రెండు పార్టీల మధ్యా అవగాహన కుదరలేదు. ఒక దశలో, ప్రధాని అభ్యర్థి రేసులో నేనూ ఉంటాను అని శరద్ పవార్ వ్యాఖ్యానించిన సందర్భాలున్నాయి. ఇప్పుడీ లోక్ సభ ఎన్నికల సందర్భంగా వాటన్నింటినీ రెండు పార్టీలూ పక్కనపెట్టడం విశేషం. అయితే, కాంగ్రెస్, ఎన్సీపీలతోపాటు మరో రెండు పార్టీలు కలిసొచ్చే అవకాశం ఉందని సమాచారం. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, సమాజ్ వాదీ పార్టీ కూడా మహారాష్ట్రలో ఉంది. మిగిలున్న 8 సీట్లలో వీటికి తలా ఒక్కోటి కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పార్టీలతో ఇంకా సంప్రదింపులు జరపాల్సి ఉందని తెలుస్తోంది.
ఇక, శివసేన పరిస్థితి ఏంటనేది ఇంకా తేలాల్సి ఉంది. ఎందుకంటే, మోడీ వ్యతిరేక ఫ్రెంట్ అనగానే ముందు వరుసలో ఉంటామన్నట్టుగా ఆ పార్టీ తీరు ఈ మధ్య ఉంటోంది. మోడీపై ఆ పార్టీ ఏ స్థాయిలో గుర్రుగా ఉందో తెలిసిందే. దీంతో, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమికి తోడుగా శివసేన కూడా చేతులు కలిపే అవకాశాలున్నాయా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే, లోక్ సభ ఎన్నికలకు ముందు ‘ఎవరికి మద్దతు’ అనే అంశంపై శివసేన స్పష్టత ఇచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. కాబట్టి, కాంగ్రెస్, ఎన్సీపీలు కూడా శివసేనను ఆకర్షించే ప్రయత్నాలను ఎన్నికల తరువాత చేస్తుందనే అనిపిస్తోంది. మూడు రాష్ట్రాల ఎన్నికల తరువాత, బలమైన ప్రాంతీయ పార్టీలను దగ్గరకి చేర్చుకునే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్. రాష్ట్రానికి ఏదో ఒక పార్టీతో పొత్తు అని పరిమితం కాకుండా… చిన్నాపెద్దా అని తేడా లేకుండా తమతో కలిసొచ్చే పార్టీలను కలుపుకునే మూడ్ లోకి వచ్చింది.