తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రతీ రోజూ ఓ శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. కేంద్రం అన్యాయం చేసిందని పదే పదే చెబుతున్నారు. విభజన హామీలు అన్నీ అములు చేస్తామని.. నమ్మించి మోసం చేసిందని నేరుగానే చెబుతున్నారు. ఈ కారణంగా రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు పెరుగుతున్నాయి. నిజంగానే చంద్రబాబును… నరేంద్రమోడీ మోసం చేశారా..?
గుజరాత్ మోడల్ అభివృద్ధి గురించి ముందు తెలియదా..?
ప్రధానమంత్రి నరేంద్రమోడీని చంద్రబాబు నాలుగేళ్ల కిందట విపరీతంగా పొగిడారు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో… గుజరాత్ మోడల్ అభివృద్ధి గురించి చాలా చెప్పారు. అలాంటి అభివృద్ధి దేశానికి కావాలన్నారు. నిజానికి గుజరాత్ మోడల్ అభివృద్ధి ఏమిటో… చెప్పలేదు. గుజరాత్ లో మానవాభివృద్ధి సూచికలు ఎప్పుడూ కింది స్థాయిలోనే ఉంటాయి. సగటు పౌరుల జీవన ప్రమాణాలు ఎప్పుడూ తక్కువగానే ఉంటాయి. శిశు , మహిళాభివృద్ధి సహా.. ఏ విషయంలోనూ అభివృద్ధి లేదు. అయితే.. ఎక్కువగా పెట్టుబడులు ఆకర్షిస్తున్న రాష్ట్రంగా గుజరాత్ ఉంది. మహారాష్ట్రతో పోటీ పడి.. పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తూ ఉంటాయి. దేశంలోని అత్యంత ధనిక పారిశ్రామిక వేత్తలు గుజరాత్ కు చెందిన వారు. సహజంగా చారిత్రకంగా చూసుకున్న గుజరాతీయులు.. వ్యాపారస్తులు. పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేస్తూంటారు. ఈ కారణంగా పెట్టుబడుల్లో గుజరాత్ ముందంజలో ఉన్న మానవాభివృద్ధిలో మాత్రం దిగువ రాష్ట్రంగానే ఉంటోంది. ఉదాహరణకు ఐటీ రంగం తీసుకుందాం. ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఐటీ రంగం అభివృద్ధి చెందింది. కానీ గుజరాత్ లో అభివృద్ధి చెందలేదు. ప్రపంచంలోఎక్కడికి వెళ్లినా ఐటీ రంగంలో తెలుగు వాళ్లు కనిపిస్తారు. కానీ గుజరాతీలు కన్పించరు. ఇప్పుడు చంద్రబాబు అడుగుతున్నారు. ఇవన్నీ తెలిసినా… చంద్రబాబు అప్పుడు ఎందుకు అడగలేదు..?
రాజకీయ అవసరాల కోసమే కదా కలిసింది..?
విభజన హామీల విషయంలో నమ్మి మోసపోయానని చంద్రబాబు చెప్పడం తనను తాను అవమానించుకోవడమే. ఎందుకంటే… ఆయన గత ఎన్నికల సమయంలో రాజకీయ అవసరాల కోసం కలిశారు. ఇప్పుడు ఆయన రాజకీయ అవసరాలు మారాయి. అందుకే బీజేపీకి దూరమయ్యారు. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలి.అప్పుడు ప్రజలు నిర్ణయించుకుంటారు. కానీ… నమ్మించి మోసం చేశారని.. చెప్పుకోవడం ఎందుకు..? చంద్రబాబు సీనియర్ మోస్ట్ లీడర్. 2014లో కంటే తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా.. పదేళ్లు ప్రతిపక్ష నేతగా చేశారు. దేసంలోనే సీనియర్ మోస్ట్ లీడర్‌గా ఉన్నారు. ఆయన సామాన్యుడిలా.. తాను నరేంద్రమోడీని నమ్మి మోసపోయానని చెప్పుకుంటున్నారు. ఇలా చెప్పుకోవడం .. తనను తాను అవమానించుకోవడమే. చంద్రబాబు స్థాయిలో అంత అవగాహన లేకుండా నమ్ముతారని అనుకోలేము.
తాము మోసపోయామని ప్రజలు అనుకుంటారా..?
చంద్రబాబునాయుడు బీజేపీని నమ్మి మోసపోయామని చెబుతున్నారు. బీజే్పీ నేతలు తాము చంద్రబాబు నాయుడిని నమ్మి మోసపోయామని చెబుతున్నారు. ఈ విషయంలో ప్రజలు మాత్రం ఇంకో రకంగా ఆలోచించే అవకాశం ఉంది. ఇద్దర్నీ నమ్మి తాము మోసపోయామని ప్రజలు భావించే అవకాశం ఉంది. ఇద్దరూ రాజకీయ అవసరాల కోసం కలిశారు. ఇప్పుడు వారి రాజకీయ అవసరాలు వేర్వేరు అయ్యాయి. అందుకే విడిపోయారు. పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. అంతే.. చంద్రబాబు చెబుతున్నట్లు ఆయన మోసపోయారని నేను అనుకోవడం లేదు.