మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్.సి.పి.ల మధ్య పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. అయితే, అక్కడి భాజపాలో ఇంకోరకమైన చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ప్రధాని అభ్యర్థి మారాలి అనే వాదన అక్కడి నుంచే చిన్నగా మొదలైంది. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో మోడీని మరోసారి ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తూ ఎన్నికలకు వెళ్తే నష్టం జరుగుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్రకు సంబంధించిన ప్రభుత్వ కార్పొరేషన్ల ఛైర్మన్లు అందరూ కొన్ని లేఖలు రాశారు. మోడీని మార్చాలనేదే ఆ లేఖల్లో సారాంశం. పార్టీ రాష్ట్ర నాయకత్వంతోపాటు, జాతీయ నాయకత్వానికి కూడా ఈ లేఖల్ని పంపారు. ఈ క్రమంలో ప్రధాని అభ్యర్థిగా నితిన్ గట్కరీ ఉండాలనే డిమాండ్ ను కూ ఆయా లేఖల్లో ప్రస్థావించారు.
ఈ నేపథ్యంలో శివసేన స్పందన ఏంటనేది కూడా ఆసక్తికరంగా మారింది. మోడీని ఆ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. నిన్ననే… శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ఓ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ… రోజులుమారాయనీ, కాపలాదారులే దొంగలుగా మారుతున్నారంటూ పరోక్షంగా మోడీపై విమర్శలు చేశారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై కూడా విమర్శలు చేశారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో భాజపాకి శివసేన దూరంగా ఉండే పరిస్థితులే ఇక్కడ పైపైకి కనిపిస్తున్నాయి. మోడీ ప్రధాని అభ్యర్థిత్వం మారితే… శివసేన ఆలోచన మార్చుకునే అవకాశాలున్నట్టుగా కూడా కనిపిస్తోంది. ప్రధాని అభ్యర్థి మారితే భాజపాతో శివసేన కలిసే అవకాశాలు ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో గట్కరీతో శివసేన సంబంధాలు ఏంటనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే, ప్రధాని అభ్యర్థిగా గట్కరీ అనే డిమాండ్ పై ఇప్పటికే ఆయన స్పందించేయడం కూడా జరిగింది. తనకి అలాంటి ఆలోచనలు లేవనీ, ఉన్న పదవితోనే సంతృప్తిగా ఉన్నానంటూ గట్కరీ కూడా చెప్పేశారు. అయినా, మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఈచర్చ ఇంకా జరుగుతోందని సమాచారం.
గత ఎన్నికల్లో మోడీ అనేది ఒక బ్రాండ్..! కానీ, ఇప్పుడా పరిస్థితిలో మార్పు వచ్చిందన్నది సుస్పష్టం. మోడీపై ప్రజలందరూ చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఆశలన్నింటినీ మోడీ నిలువునా కూల్చేశారు. అక్కడితో ఆగకుండా, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, అదుపులేని పెట్రో ధరలు… ఇలా సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసే నిర్ణయాలు తీసుకున్నారు. వీటి వల్ల ప్రజాగ్రహం ఏ స్థాయికి చేరిందనేది మూడు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపాకి అర్థమయ్యే ఉండాలి. అందుకే, లోక్ సభ ఎన్నికల్లో ప్రధానిగా మరోసారి మోడీ ఉంటే పరిస్థితి ఏంటనే చర్చ పార్టీలో మొదలు కావడం సహజం. గట్కరీ ప్రధాని అభ్యర్థిగా ఉంటారా లేదా అనేది ప్రధానమైన చర్చ కాకపోయినా… మోడీని మార్చాలనే చర్చ మొదలైందనడానికి ఇదో ఉదాహరణ.