‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తో తనదైన స్టైల్లో అలజడి సృష్టిస్తున్నాడు రాంగోపాల్ వర్మ. తన ఉద్దేశ్యం వివాదాలే కాబట్టి.. దానికి తగిన సరంజామాతోనే సిద్ధమవుతున్నాడు. `లక్ష్మీస్ ఎన్టీఆర్`లో ఏముంది? చంద్రబాబుని ఎలా చూపించబోతున్నాడు? ఎన్టీఆర్ చివరి రోజుల్లో జరిగిన సంగతులేంటి? అనే విషయాలపై సగటు ప్రేక్షకుడు ఆసక్తి కనబరచడం సహజం. వాటిని వర్మ ఎలా తెరకెక్కిస్తాడన్నది కీలకంగా మారింది. అయితే వర్మ చాలా పకడ్బందీ వ్యూహంతోనే ముందుకు వస్తున్నాడు. స్క్రిప్టు విషయంలో చాలా లోతుగా పరిశోధించినట్టు తెలుస్తోంది.
అప్పట్లో ఎన్టీఆర్ – లక్ష్మీ పార్వతిలకు సన్నిహితంగా మెలిగిన కొంతమంది పాత్రికేయుల్ని వర్మ కలిశాడు. అంతేకాదు… ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఎన్టీఆర్ తో పాటు ఉంటూ, వార్తల్ని కవర్ చేసిన రిపోర్టర్లనీ, అప్పటి ప్రధాన పత్రికల్లో కీలక స్థానాల్లో ఉన్న పాత్రికేయులతోనూ వర్మ ఓ స్టార్ హోటల్లో విడివిడిగా భేటీ వేసినట్టు సమాచారం. పాత్రికేయులకు ఆఫ్ ది రికార్డ్కి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుస్తుంటాయి. వాటిని పేపర్లలో రాయలేరు. అలాంటి విషయాల్ని సైతం వర్మ సేకరించాడట. అవన్నీ `లక్ష్మీస్ ఎన్టీఆర్`లో కీలకంగా మారబోతున్నాయని తెలుస్తోంది. మొత్తానికి ఈసారి బ్యాక్ గ్రౌండ్ వర్క్ గట్టిగానే చేశాడు వర్మ. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.