ఎన్టీఆర్ బయోపిక్ లో ఏయే పాత్రల్లో ఎవరెవరు కనిపిస్తారో తేలిపోయింది. ఇందుకు సంబంధించి నటీనటుల జాబితాని చిత్రబృందం విడుదల చేసింది. దీంతో పాటు.. ఈ సినిమాలో ఎవరెవరు కనిపించకుండా పోయారో అన్న విషయంపైనా క్లారిటీ వచ్చేసింది. కృష్ఱ, శోభన్‌బాబు, కృష్ణంరాజు, కాంతారావు, మోహన్‌బాబు ఈ పాత్రలేమీ ఎన్టీఆర్ బయోపిక్ లో లేవు.మిగిలిన పాత్రల మాటేమో గానీ.. బయోపిక్‌లో కృష్ణ లేకపోవడం పెద్ద లోటే. ఎందుకంటే… ఎన్టీఆర్ – కృష్ణ కాంబినేషన్లో సూపర్ హిట్ చిత్రాలొచ్చాయి. ఇద్దరి బంధం ప్రత్యేకమైనది. ఎన్టీఆర్ కలల పాత్ర `అల్లూరి సీతారామరాజు`ని ఎన్టీఆర్ కంటే ముందే వేసేసి.. ఎన్టీఆర్ చేతే సెభాష్ అనిపించుకున్నాడు కృష్ణ. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తరవాత.. ఇద్దరి మధ్య సిద్దాంతపరమైన బేధాభిప్రాయాలు వచ్చాయి. ఎన్టీఆర్‌పై సెటైరికల్‌గా `మండలాదీశుడు` అనే సినిమా తీశాడు కృష్ణ. అప్పట్లో అదో సంచలనం. ఎన్టీఆర్‌కి ఢీ కొట్టే దమ్మున్న మొనగాడు కృష్ణే అని అప్పట్లో సినీ, రాజకీయ జనాలు కృష్ణని ఆకాశానికి ఎత్తేశారు. సిద్దాంత పరమైన విబేధాలు ఉన్నప్పటికీ ఇద్దరి స్నేహానికి ఎక్కడా ఎలాంటి బ్రేకులూ పడలేదు. అలా ఎన్టీఆర్ సినీ, రాజకీయ జీవితాలతో అనుబంధం ఏర్పరచుకున్న కృష్ణ పాత్ర లేకపోవడం నిజంగా లోటుగానే కనిపిస్తోంది. ఈ పాత్ర కోసం మహేష్ బాబుని సంప్రదించడం, మహేష్ ‘నో’ చెప్పడంతో.. కృష్ణ పాత్రని పూర్తిగా పక్కన పెట్టేశాడు. కనీసం ఆ పాత్రని సుధీర్‌బాబుతో చేయించినా బాగుండేదేమో..?!