మాజీ మంత్రి మాణిక్యాలరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపారు. ఎవరైనా ఎమ్మెల్యే రాజీనామా చేస్తే.. స్పీకర్ కార్యాలయానికి కదా లేఖ పంపేది… ఆ మాత్రం ఆయనకు అవగాహన లేదా.. అనే డౌట్ రావొచ్చు కానీ.. ఆయన సీఎం కార్యాలయానికే పంపారు. దానితో పాటు.. తన డిమాండ్ల లేఖ పంపారు. ఆ డిమాండ్లు పరిష్కరిస్తే సరే.. తనను పదవిలో ఉంచమంటున్నారు. లేదంటే.. తన రాజీనామా లేఖను..స్పీకర్ కు పంపి.. ఆమోదింప చేసి.. తనను పదవీచ్యుడిని చేయాలనేది ఆయన డిమాండ్.
ఇంతకీ మాణిక్యాల రావు ఎందుకు రాజీనామా చేశారంటే…తాడేపల్లి గూడెంకు చంద్రబాబు కొన్ని హామీలు ఇచ్చారట. ఆ హామీలు నెరవేరలేదట. ఆ హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ లేఖ పంపారు. అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లేరు కాబట్టే.. ఆ హామీలను పట్టించుకోలేదనేది… మాణిక్యాలరావు వాదన. కానీ ఆయన టీడీపీతో పొత్తుతో గెలిచారనే విషయం మర్చిపోయారు. నాలుగేళ్ల పాటు మంత్రిగా కూడా ఉన్నారు. అంటే.. ఓ రకంగా ఆయన అధికార పార్టీనే. మంత్రిగా తన నియోజకవర్గానికి తాను స్వయంగా చేసుకోగలిగినంత అధికారంలో ఉన్నారు. కానీ అప్పుడేమీ పట్టించుకోకుండా.. ఇప్పుడు మాత్రం…ఎన్నికలకు నోటిఫికేషన్ రెండు నెలల్లో వస్తందనగా… కొత్తగా రాజకీయం ప్రారంభించారు.
పదిహేను రోజుల్లో స్పందించకపోతే.. పదహారో రోజున నిరహారదీక్ష చేస్తానని కూడా మాణిక్యాలరావు వార్నింగ్ ఇచ్చారు. మాణిక్యాలరావు… ఇటీవలి కాలంలో… ఈ తరహా రాజకీయాలు జోరుగానే చేస్తున్నారు. తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్చార్జ్ … ముళ్లపూడి బాపిరాజుతో.. పదే పదే లడాయికి దిగి.. వార్తల్లో నిలిచే ప్రయత్నం చేశారు. ఆయనపై ఆరోపణలు.. చేసి చర్చలకు సవాళ్లు చేసి.. మీడియాలో హైలెట్ అయ్యారు. అదేదో బాగుందని.. ఇప్పుడు ఇంకొంచెం ముందుకెళ్తున్నారు.