తాడేపల్లి గూడెం బీజేపీ ఎమ్మెల్యే మాణిక్యాల రావు రాజీనామా పేరుతో చేస్తున్న హడావుడిని ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుపట్టారు నియోజకవర్గం అభివృద్దికి ముఖ్యమంత్రి హామీ ఇవ్వకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మాజీ మంత్రి మాణిక్యాలరావు ఓ లేఖ సీఎంకు పంపారు. ఆ హామీలన్నీ నెరవేర్చకపోతే.. దాన్ని రాజీనామా లేఖగా భావించి .. స్పీకర్ కు పంపాలని.. ఓ సలహా కూడా ఇచ్చారు. ఈ విషయంలో మాణిక్యాలరావుపై చంద్రబాబు మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లాలోనే ఉన్న పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం డబ్బులు ఇవ్వకపోతే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అలాగే తాడేపల్లి గూడెంలో నిర్మిస్తున్న యన్.ఐ.టి కి కేంద్రం నిధులు మంజూరు చేయకపోతే రాజీనామా ఎందుకు చేయలేదని సీఎం నిలదీశారు.
నిజానికి ఎన్ఐటీని తానే తీసుకొచ్చానని.. మాణిక్యాల రావు ప్రచారం చేసుకుంటూ ఉంటారు. అయితే దానికి నిధుల కేటాయింపు అంతంతమాత్రంగానే ఉంది. ప్రభుత్వం వందల కోట్లు విలువైన భూమి ఇచ్చినప్పటికీ.. హామీ ఇచ్చినట్లుగా నిధుల విడుదల జరగడం లేదు. ఇదే విషయాన్ని చంద్రబాబు గుర్తు చేసి..కేంద్రాన్ని .. అదీ కూడా సొంత పార్టీని ఎందుకు ప్రశ్నించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ గడ్డపై పుట్టిన బిడ్డగా జన్మభూమిపై మీకు మమకారం లేదా అని నిలదీశారు. రాష్ట్రానికి రాబోతున్న ప్రధాని మోడీ పర్యటనకు నిరసనగా ధర్నా చేయాలని సలహా ఇచ్చారు. తాడేపల్లి గూడెంలో ఏమి అభివృద్ది జరిగిందో ప్రజందరికీ తెలుసని, అక్కడ జడ్పీ ఛైర్మన్, మున్సిపల్ ఛైర్మన్ కూడా ఉన్నారని చంద్రబాబు గుర్తు చేశారు. రాజీనామా బెదిరింపులు లాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని, ఇటువంటి బెదిరింపులకు ఎవరూ భయపడరని స్పష్టం చేశారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో .. అదీ కూడా మోడీ పర్యటనకు వస్తున్న సమయంలో.. చంద్రబాబు బీజేపీపై దాడిని పెంచారు. శ్వేతపత్రాలు విడుదల చేస్తూ… వాస్తవాలు ప్రజల ముందు ఉంచుతున్నారు. వాటికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో బీజేపీ .. రాజీనామాల పేరుతో .. ప్రజల దృష్టిని మరల్చి.. మోడీ టూర్ కు ఇబ్బంది లేకుండా చూసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్లు టీడీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి.