అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఒకింత స్తబ్దత నెలకొన్న సంగతి తెలిసిందే. ఇంకోపక్క, లోక్ సభ ఎన్నికలూ కూడా సమీపిస్తుండటంతో పార్టీలో మరింత జోష్ నిండాల్సిన అవసరం ఉంది. అయితే, రాష్ట్ర స్థాయిలో ఇంకా అలాంటి ప్రయత్నాలేవీ మొదలు కాలేదు. దీంతో ఇప్పుడు హైకమాండ్ రంగంలోకి దిగుతున్నట్టు సమాచారం. దీన్లో భాగంగా పార్టీకి చెందిన ప్రముఖ నేతలు, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను ఢిల్లీకి పిలిచినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ నేతలతో సమావేశం నిర్వహించి, ఓటమికి కారణాలతోపాటు, లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జరిగే అవకాశం ఉందని సమాచారం. సీఎల్పీ నాయకుడి ఎంపిక కూడా ఢిల్లీలోనే జరగొచ్చనీ తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి సంబంధించిన కారణాలపై పీసీసీ ఒక నివేదిక సిద్ధం చేసిందట. దీన్లో ఓటమికి ప్రధాన కారణాలుగా పొత్తులను చేర్చినట్టు సమాచారం! దీంతోపాటు అభ్యర్థుల ఎంపికలో కూడా కొన్ని పొరపాట్లు జరిగాయనీ, ఎన్నికల నిర్వహణలో కూడా లోపాలున్నాయనీ, ఈవీఎమ్ ల పనితీరుపై కూడా కొన్ని అనుమానాలున్నట్టుగా ఆ రిపోర్టులో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే… రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటమి కారణాలను హైకమాండ్ కూడా తన పరిధిలో అభిప్రాయాలు సేకరించిందట. తెలంగాణకు చెందిన కొంతమంది సీనియర్ నేతల అభిప్రాయాలూ విశ్లేషణలను హైకమాండ్ పరిగణనలోకి తీసుకుందట.పీసీసీ నుంచి వచ్చిన ఓటమి కారణాల నివేదిక, కేంద్రం తెప్పించుకున్న సమాచారం… ఇవన్నీ దగ్గరపెట్టుకుని జరిగిన పొరపాట్లపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది.
పనిలోపనిగా పార్టీ బాధ్యతల విషయంలో కూడా సమూల ప్రక్షాళన జరగాలని హైకమాండ్ అనుకుంటున్నట్టు కాంగ్రెస్ వర్గాల నుంచే వినిపిస్తోంది. అయితే, ముందుగా లోక్ సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి… ఆ దిశగా తెలంగాణలోని పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే ప్రక్రియపై హైకమాండ్ దృష్టి పెడుతుందనీ, ఇప్పట్లో మార్పులూ చేర్పులూ జోలికి వెళ్లకపోవచ్చనేది కొంతమంది అభిప్రాయం. ఈ సమయంలో మార్పులంటే… టి కాంగ్రెస్ నేతల్ని ఏకతాటిపై నిలిపి ఉంచడం కొంత కష్టంగా మారొచ్చు. కానీ, లోక్ సభ ఎన్నికల తరువాత తెలంగాణ కాంగ్రెస్ లో సమూల మార్పులు తప్పవనే అభిప్రాయంతో హైకమాండ్ ఉందనేది స్పష్టం!