ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై మరోసారి వ్యంగ్య విమర్శలు చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. క్షేత్రస్థాయి కార్యకర్తలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే పరిస్థితిలో మోడీ లేరన్నారు. అలాంటి వ్యక్తి మీడియా సమావేశాలు నిర్వహించడమేంటంటూ ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు. గతవారం పుదుచ్చేరిలోని బూత్ స్థాయి కార్యకర్తలతో ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ సందర్భంగా ఓ కార్యకర్త అడిగిన ప్రశ్నకు మోడీ స్పందించిన తీరును… ఆ వార్తాకథనం లింక్ ను ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ రాహుల్ విమర్శలు చేశారు.
ఆ సమావేశంలో నిర్మల్ కుమార్ జైన్ అనే కార్యకర్త ప్రధానిని ఓ ప్రశ్న అడిగారు. మధ్య తరగతి ప్రజల నుంచి పన్నులు వసూళ్లు చేయడం మీదే ఎక్కువ శ్రద్ధ పెడుతున్నట్టుగా ఉందనీ, అలాంటి శ్రద్ధ మధ్య తరగతి ప్రజల సంక్షేమంపై ఎందుకు పెట్టడం లేదంటూ మోడీని ప్రశ్నించారు. దీనికి మోడీ స్పందిస్తూ… ‘మీరు వ్యాపారి కాబట్టి, ఆ తరహాలోనే మాట్లాడటం మీ స్వాభావం. ప్రజల పక్షానే నేను ఉంటాను’ అంటూ కాసేపు అటూఇటూ చూస్తూ టైం పాస్ చేశారు. కార్యకర్త అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా… వణక్కం పుదుచ్ఛేరీ అంటూ దాటేశారు.
ఇదే టాపిక్ ను మరోసారి గుర్తు చేస్తూ రాహుల్ తాజాగా ట్వీట్ చేశారు. మధ్య తరగతి ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు ప్రధానమంత్రి సమాధానం ఇవ్వకుండా చర్చను పక్కతోవ పట్టించడమేంటన్నారు. ఇది జరిగిన తరువాత, సొంత పార్టీ కార్యకర్తలు మోడీని అడగాలనుకున్న ప్రశ్నలన్నింటినీ ఆ పార్టీవారు ముందుగానే అడిగి తెలుసుకోవడం మొదలుపెట్టారన్నారు. ప్రశ్నలకి సమాధానాలు చెప్పుకుండా.. తప్పించుకోవడం అనేది సూపర్ ఐడియా అనీ, ఇలాగే సమాధానాలు చెప్పడం కూడా దాటేస్తుంటే ఇంకా బాగుంటుందంటూ రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.
మోడీని విమర్శించడానికి దొరికే ఏ ఛాన్స్ నీ ఈ మధ్య రాహుల్ వదులుకోవడం లేదు. అందుకే, వారం కిందట జరిగిన కార్యక్రమాన్ని ఇప్పుడు మళ్లీ గుర్తుచేశారు. జీఎస్టీ భారాన్ని 12 శాతం వరకూ కొన్ని వస్తువులపై తగ్గించే ఆలోచనలో ఉన్నామని మోడీ చెప్పినప్పుడు కూడా ఇలాగే ట్విట్టర్ లో స్పందించారు. జీఎస్టీ తగ్గించొచ్చు అని తాను గతంలో చెప్తే గ్రేట్ స్టుపిడ్ థాట్ అంటూ ఎద్దేవా చేశారనీ, ఆలస్యంగానై కళ్లు తెరిస్తే సంతోషమే కదా అంటూ రాహుల్ వ్యంగ్యంగా స్పందించారు. మూడు రాష్ట్రాల ఎన్నికల గెలుపు తరువాత మోడీపై విమర్శల దాడిని రాహుల్ బాగానే పెంచుతున్నారు.