టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం మొదటగా… ఒడిషా వెళ్లారు. అక్కడ ఫ్రంట్ చర్చల విషయంలో ఎలాంటి ముందడుగు పడలేదు. కాంగ్రెస్, బీజేపీలకు దూరంగా ఉండాలనే తమ విధానంలో ఎలాంటి మార్పూ లేదని.. . బీజేడీ.. కేసీఆర్ పర్యటన తర్వాత మీడియాకు సమాచారం ఇచ్చింది. అంటే ఫెడరల్ ఫ్రంట్ విషయంలో తమకు మరో ఆలోచన లేదని చెప్పడమే. అయితే… కేసీఆర్, నవీన్ పట్నాయక్ల భేటీలో పోలవరం అంశం చర్చకు వచ్చింది. ఈ విషయాన్ని కేసీఆర్.. మీడియా సమావేశంలో చెప్పలేదు కానీ… నవీన్ పట్నాయక్ మాత్రం చెప్పారు. దీంతో ఏపీలో ఈ విషయం చర్చనీయాంశం అయింది.
పోలవరం ప్రాజెక్ట్ విషయాన్ని కేసీఆర్ , నవీన్ పట్నాయక్ వద్ద లేవనెత్తాల్సిన అవసరం ఏముందన్న చర్చ ఏపీ వర్గాల్లోనూ ప్రారంభమయింది. పోలవరం ప్రాజెక్ట్ పై ఒడిషాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. వాటిని ఆసరాగా చేసుకుని పోలవరం ప్రాజెక్ట్ ను ఆపేలా… కేసీఆర్ కుట్ర చేస్తున్నారని.. దానికి జగన్ సహకరిస్తున్నారని..టీడీపీ ఆరోపణలు ప్రారంభించింది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా.. ఈ విషయంలో… రెండు రోజుల నుంచి విమర్శలు చేస్తున్నారు. కేంద్రం, కేసీఆర్ , జగన్ ను కలిసి నవీన్ పట్నాయక్ను రెచ్చగొట్టి… పోలవరం ప్రాజెక్ట్ను ఆపే ప్రయత్నం చేస్తున్నారనేది..టీడీపీ నేతల అనుమానం. చంద్రబాబు కూడా ఇదే రకంగా స్పందించడంతో.. నవీన్ పట్నాయక్ హుటాహుటిన తమ ఎంపీ సౌమ్యారంజన్ను… చంద్రబాబు వద్దకు పంపించారు. కేసీఆర్ తో జరిగిన చర్చల వివరాలను వివరించారు. పోలవరంపై కేసీఆర్ ఏం మాట్లాడారో చెప్పారు. జాతీయ రాజకీయాలకు సంబంధించి ఇతర అంశాలపైనా చర్చించినట్లు సమాచారం.
నవీన్ పట్నాయక్ రాజకీయ అరంగేట్రం చేసిన మొదట్లో కేంద్రమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో చంద్రబాబు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా ఉన్నారు. ఆ సమయం నుంచి ఇద్దరి మధ్య మిత్రుత్వం ఉంది. ఆ తర్వాత జనతాదళ్ నుంచి విడిపోయి సొంత పార్టీ పెట్టుకున్న నవీన్ పట్నాయక్ కోసం… 2001లో జరిగిన ఒడిషా ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం చేశారు కూడా. అప్పటి నుంచి… స్నేహం కొనసాగుతోంది. కేసీఆర్ పర్యటన తర్వాత పోలవరం విషయంలో అపోహలు రావడంతో.. ఎంపీని పంపి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.