నరేంద్రమోడీ ఆరో తేదీన గుంటూరు సభలో ప్రసంగించనున్నారు. బీజేపీ ఈ సభపై టెన్షన్ పడుతోంది. అసలు కన్నా.. కొసరే ఎక్కువైనట్లు.. మోడీకి నిరసనలే ఎక్కువగా వినిపిస్తే.. సమస్య అవుతుందని ఆందోళన చెందుతోంది. అందుకే.. కొత్తగా.. ఎదురుదాడి ప్రారంభించింది. అందులో భాగంగానే.. మాణిక్యాలరావు రాజీనామా ఎపిసోడ్ ప్రారంభించారన్న ప్రచారం జరుగుతోంది. దీనికి మాణిక్యాల రావే ఎందుకంటే.. ఆయన తప్ప.. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు.. పక్క చూపుల్లో ఉండటమే కారణం. మాణిక్యాల రావు మాత్రమే.. ఆరెస్సెస్ స్థాయి నుంచి నిబద్ధత కలిగిన వ్యక్తిగా.. ఉన్నారు. దాంతో ఆయనే చొరవ తీసుకున్నారు. బీజేపీ ప్లాన్ ను అమలు చేస్తున్నారు.
దీనికి తాడేపల్లిగూడెం రాజకీయాలు కూడా తోడయ్యాయి. పెద్దగా కార్యకర్తల బలం లేనప్పటికీ.. టీడీపీ బలంతో గెలిచి.. మంత్రి అయిన మాణిక్యాల రావు మొదటి నుంచి టీడీపీనే గురి పెట్టారు. అక్కడి టీడీపీ ఇన్చార్జ్ ముళ్లపూడి బాపిరాజును.. నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు. దీనికి ఆయన అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ.. కారణాలు చెప్పుకొచ్చారు. ఇప్పుడు దీన్ని ముఖ్యమంత్రి దాకా తీసుకెళ్లారు. మాణిక్యాల రావు గతంలో కూడా.. చర్చకు సై అని సవాళ్లు చేసి.. కాస్త డ్రామా నడిపారు. మోడీ పర్యటనకు ముందు ఇలాంటివి జరిపితే… కాస్తంత ప్రచారం వస్తుందన్న ఉద్దేశంతో బీజేపీ అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే వచ్చే కొద్ది రోజుల్లో..బీజేపీ ఇలాంటి హడావుడి చేయడానికి ఎక్కువ అవకాశం ఉందంటున్నారు.
అయితే మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల సంగతేమిటన్నది…చర్చనీయాంశంగా మారింది. తమ జిల్లాలకు కూడా చంద్రబాబు అన్యాయం చేశారని ఓ లేఖ రాసి.. రాజీనామా చేసేస్తే.. ఎఫెక్ట్ ఎక్కువగా ఉండేది కదా.. అన్న చర్చ బీజేపీలో నడుస్తోంది. కానీ ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు ఇప్పుడు అంత తీరిక లేదు. కామినేని శ్రీనివాస్ .. బీజేపీలో ఉన్నారా లేదా.. అని రోజూ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆయన పోటీ చేయబోనని చెప్పేశారు. ఇక విష్ణుకుమార్ రాజు… అటు వైసీపీ, ఇటు టీడీపీల్లో చేరవొచ్చంటూ.. రోజు మార్చి రోజు ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఇక మరో ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ.. ఇప్పటికే జనసేన తరపున తనకు లోక్ సభ టిక్కెట్, తన భార్యకు అసెంబ్లీ టిక్కెట్ ఖరారు చేసుకున్నారని… రాజమండ్రిలో అందరికీ తెలిసిపోయింది. ఇక మిగిలింది మాణిక్యం మాత్రమే. అందుకే.. బీజేపీ ఆయనను వాడుకుంటోంది.