ప్రతిభ కంటే.. విజయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే పరిశ్రమ ఇది. అందులో తప్పేం లేదు. కోట్లతో ముడిపడిన వ్యాపారం ఇది. అందుకే గెలుపు గుర్రాలనే నమ్ముకుంటుంటారు. ఓ హిట్ వస్తే… కొత్త దర్శకులైనా సరే, స్టార్ హీరోల దృష్టిలో పడిపోతుంటారు. స్టార్ లీగ్‌లో చేరడానికి యువ దర్శకులకు ఉన్న దూరం ఆ ఒక్క విజయమే. హను రాఘవపూడి కీ ఆ అవకాశం వచ్చింది. తన కొత్త సినిమా `పడి పడి లేచె మనసు` హిట్టయితే.. తప్పకుండా ఓ మెగా ఆఫర్ అందుకునే వాడు. కొద్ది దూరంలో బంగారంలాంటి ఆ అవకాశం మిస్ అయ్యింది.
`పడి పడి లేచె మనసు` ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి అతిథిగా వచ్చాడు అల్లు అర్జున్. ఆ సమయంలోనే లవ్ స్టోరీ చేయాలని వుందని తన మనసులో మాట బయటపెట్టాడు. తన దృష్టి హను రాఘవపూడిపై ఉందని బన్నీ మాటల్ని బట్టి అర్థమైపోయింది. అప్పటికి `పడి పడి లేచె మనసు`కి మంచి బజ్ ఏర్పడింది. ట్రైలర్ కూడా జనాలకు నచ్చేసింది. దాంతో ఎందుకైనా మంచిదని… హనుని పిలిపించుకున్నాడు బన్నీ. వీరిద్దరి మధ్య కథకు సంబంధించిన చర్చలు జరిగాయని సమాచారం. `పడి పడి లేచె` హిట్టయితే గనుక.. వెంటనే బన్నీ.. హనుతో ఓ సినిమా ప్రకటించేద్దుడు. కానీ.. ఆ ఆస్కారం లేకుండా పోయింది. కాకపోతే.. ఈ సినిమాలోనూ హను ప్రేమకథని నడిపించిన పద్ధతి అందరికీ నచ్చింది. సెకండాఫ్‌లో లోపాలు ఈ సినిమాని బలి తీసుకున్నాయి గానీ, ఫస్టాప్‌లో ప్రేమకథ యువతరాన్ని అలరించింది. అదొక్కటీ దృష్టిలో ఉంచుకుంటే.. బన్నీ హనుని నమ్ముకోవొచ్చు. కానీ.. బన్నీ ప్రస్తుతం రిస్క్ తీసుకునే పరిస్థితుల్లో లేడు. అందుకే… హనుతో సినిమా చేసే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. బన్నీ మనసు మార్చుకుని, సాహసాలు చేయడానికి పూనుకుంటే మాత్రం హను పంట పండినట్టే.