2018లో రానా నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే.. 2019లో మాత్రం ఆ లోటు తీర్చేస్తున్నాడు. తన సినిమాలన్నీ వరుసగా విడుదల కానున్నాయి. మరోవైపు కొత్త సినిమాల్నీ పట్టాలెక్కిస్తున్నాడు. గుణశేఖర్ దర్శకత్వంలో `హిరణ్య` 2019లోనే పట్టాలెక్కబోతోంది. వేణు ఉడుగుల దర్శకత్వంలో నటించడానికి రానా ఒప్పుకున్నాడు. ఇందులో సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ చిత్రానికి `విరాటపర్వం` అనే పేరు పరిశీలిస్తున్నట్టు టాక్. అయితే ఇదేం మైథలాజికల్ సినిమా కాదు. సోషల్ స్టోరీనే. విరాటపర్వంలో ఉండే మలుపులు, రాజకీయ కుట్రలు, కుతంత్రాలు.. అన్నీ ఈ కథలోనూ కనిపిస్తాయట. అందుకే వర్కింగ్టైటిల్ గా `విరాట పర్వం` అని నామకరణం చేశారు. మరి ఇదే టైటిల్ ఉంటుందా, లేదంటే మారుస్తారా, అనేది ఇంకా తేలలేదు.`నీది నాదీ ఒకే కథ`తో ఆకట్టుకున్నాడు వేణు ఉడుగుల. ఆ సినిమా విమర్శకుల ప్రశంసల్ని అందుకుంది. ఆ సినిమాలాఏ ఓ సామాజిక అంశాన్ని ఎంచుకుని వేణు ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఈసారి కమర్షియల్ అంశాలూ ఉండేలా జాగ్రత్తపడుతున్నాడట. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.