రెండో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత… టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొదటి సారి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. తెలంగాణకు సంబంధిచిన 16 అంశాలపై మోదీకి వినతిపత్రం అందజేశారు.మొట్టమొదటి అంశంగా… కొత్త సచివాలయం నిర్మాణానికి బైసన్‌పోలో గ్రౌండ్ భూములు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రాజీవ్ రహదారి విస్తరణకు రక్షణశాఖ భూములు, కరీంనగర్లో ట్రిపుల్ ఐటీ, హైదరాబాద్‌లో ఐఐఎం, కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు, హైదరాబాద్‌కు ఐఐఎస్ఈఆర్, ఆదిలాబాద్‌లో ఎన్హెచ్ఏఐ భాగస్వామ్యంతో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కర్మాగారం పునరుద్ధరణ, జహీరాబాద్‌లో నిమ్జ్ ఏర్పాటుకు నిధులు ఇవ్వాలని విజ్జాపన పత్రంలో అందజేశారు. అలాగే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌కు రూ.1000 కోట్లు ఇవ్వాలని కోరారు. కాళేశ్వరంను జాతీయ ప్రాజెక్ట్‌గా గుర్తించి స్పెషల్ గ్రాంట్ ఇవ్వాలని.. విభజన చట్టంలోని 9, 10వ షెడ్యూల్ సంస్థల విభజనకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.
ఎస్సీ వర్గీకరణకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. విభజన చట్టంలో హామీల ప్రకారం.. వెనుకబడిన ప్రాంతాలకు రూ.450 కోట్లు ఇవ్వాలని కోరారు. కృష్ణా నదీ జల వివాదాలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వినతి పత్రంలో కీలకమైన గిరిజన, ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని కేసీఆర్ ప్రస్తావించలేదు. నరేంద్రమోదీ, కేసీఆర్ మధ్య రాజకీయాలు చర్చకు వచ్చాయా లేదా అన్న అంశంపై క్లారిటీ లేదు. ఢిల్లీకి చేరుకునే ముందు కేసీఆర్.. నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీలతో సమావేశమయ్యారు. వారితో జరిపిన చర్చల వివరాలను..మోదీతో కేసీఆర్ పంచుకుని ఉంటారని భావిస్తున్నారు. ఎన్నికల్లో ప్రజల మూడ్ ఎలా ఉందన్న అంశంపై.. మోదీ కేసీఆర్ ను అడిగి తెలుసుకుని ఉంటారని భావిస్తున్నారు.
మరో వైపు మాయవతి, అఖిలేష్ యాదవ్ లతో.. సమావేశం కావాలని కేసీఆర్ భావించారు. అయితే అఖిలేష్ యాదవ్ మాత్రం.. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల వల్ల కలవలేకపోతున్నానని ప్రకటించారు. జనవరి ఏడో తేదీ తర్వాత కేసీఆర్ ను హైదరాబాద్ లో కలుస్తానన్నారు. మాయావతిని కలుస్తారా లేదా అన్న విషయంలో క్లారిటీ లేదు. మరో వైపు మోదీతో కేసీఆర్ భేటీ కావడంపై…చంద్రబాబు భిన్నంగా స్పందించారు. ఫ్రంట్ అంటూ పర్యటనలు చేస్తున్న కేసీఆర్ ప్రధానిని కలవడంలో అర్థమేంటని ప్రశ్నించారు. పర్యటన చర్చల వివరాలను చెప్పడానికి కలుస్తున్నారా అని ప్రశ్నించారు. ఏదైనా ఒక మాట చెప్పడం వేరని, చేసే పనులు వేరేగా ఉంటున్నాయన్నారు.