‘ఎన్టీఆర్’ బయోపిక్ వెనుక రెండు బృహత్తర ఉద్దేశ్యాలు, లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి… ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగబోతున్న ఎన్నికలకు `తెలుగుదేశం` విశిష్టతని, ఆనాడు ఎన్టీఆర్ చేసిన మంచి పనుల్ని ఏకరవు పెట్టడం, రెండోది… టీడీపీ ఆవిర్భావంలో చంద్రబాబు నాయుడు చేసిన కృషిని 70 ఎం.ఎంలో చూపించడం. ఇది `ఎన్టీఆర్` కథే అయినా… ఆయన ఆల్లుడిలోని ధైర్య సాహసాలు, చాణిక్య నీతిని మరోసారి నొక్కి వక్కాణించడానికి ఈ సినిమాని ఓ వేదిక చేసుకున్నారు. ఆ పాత్రకు రానాని ఎంచుకోవడం వెనుకే ఆ పాత్రకు ‘స్టార్’ స్టేటస్ ఇవ్వాలన్న ఉద్దేశ్యాన్ని చెప్పకనే చెప్పారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో నారా చంద్రబాబు నాయుడు పాత్రని ఓస్థాయిలో చూపించే కృషి చేశారు. చంద్రబాబు నాయుడు ముందు కాంగ్రెస్ పార్టీవాడే. ఎన్టీఆర్‌పై పోటీకి దిగి ఘోరంగా ఓడిపోయిన చరిత్ర ఉంది. ఆ విషయాల్ని సైతం.. ఈ బయోపిక్‌లో చూపించారు. కాంగ్రెస్ వదిలి.. చంద్రబాబు టీడీపీలో ఎందుకు రావాల్సివచ్చింది? క్లిష్ట సమయాల్లో మావయ్యకు ఎన్ని విలువైన సలహాలు ఇచ్చాడు? అనే కోణంలోనూ చంద్రబాబు నాయుడు పాత్ర సాగబోతోందని సమాచారం.
అన్నింటికంటే ముఖ్యంగా ఈ సినిమాలో ఓ ట్రైన్ ఎపిసోడ్ ఉంది. తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే అదో కీలకఘట్టం. నాదెండ్ల భాస్కర్ సృష్టించిన సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అప్పట్లో తెలుగుదేశం ఎం.ఎల్.ఏ లను ఓ రైలులో ఢిల్లీకి తరలించాల్సివచ్చింది. మార్గమధ్యంలో రైలుపై దాడి చేసి, ఎం.ఎల్.ఏ లను లాక్కుని పోవాలని కొంతమంది దుండగులు ప్రయత్నిస్తుంటారు. వాళ్ల నుంచి కాపాడుకుంటూ, ఈ ఎం.ఎల్.ఏ లను చంద్రబాబు నాయుడు ఢిల్లీకి ఎలా చేర్చాడన్నది ఈ ఎపిసోడ్ సారాంశం. ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు కలిపి చూసినా… అందులో ఉండే యాక్షన్ ఎపిసోడ్ ఇదొక్కటే అని సమాచారం. అయితే ఈ ఎపిసోడ్ మొత్తం చంద్రబాబు నాయుడు సాహసాల్ని చూపించడానికి వాడుకున్నారు. ఇదంతా చరిత్రలో జరిగినదే. కాకపోతే…. చంద్రబాబుని ఎలివేట్ చేసిన విధానం చూస్తే.. తెరపై ఓ హీరోని చూస్తున్నామా? అన్నట్టే ఉంటుందట. ఎంతైనా… ఈ సినిమా వెనుక వ్యూహాలన్నీ చంద్రబాబు నాయుడువే. ఈ సినిమా మొదలెట్టే ముందు స్క్రిప్టుని కూడా ఆయనకు వినిపించే గ్రీన్ సిగ్నల్ అందుకున్నారు. బాబు పాత్రని ఆ మాత్రం ఎలివేట్ చేయకపోతే ఏం బాగుంటుంది? మరి ఈ ట్రైన్ ఎపిసోడ్ ఏ స్థాయిలో పేలిందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.