రాయలసీమ వాసుల చిరకాల ఆకాంక్షను ఎట్టిపరిస్థితుల్లోనూ నెరవేర్చాలన్న లక్ష్యంతో.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేస్తున్నారు. ఉక్కు పరిశ్రమకు అన్ని మౌలిక సదుపాయాలు ఉన్న జిల్లాగా కడపకు పేరు ఉంది. దశాబ్దాలుగా ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. గతంలో కడప జిల్లాలో కొన్ని ప్రైవేటు సంస్థలు స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి ముందుకు వచ్చాయి. వివిధ కారణాలతో వెనక్కి వెళ్లిపోయాయి. ఆ కారణాలు.. మౌలిక సదుపాయాలు లేకపోవడమో..మరో కారణమో కాదు.. కేవలం రాజకీయమే. 2004లో వైఎస్.. ప్రభుత్వంతో సంబంధం లేకుండా… ప్రైవేటుగా తన సన్నిహితుడు.. అప్పట్లో మైనింగ్ చేసి వేల కోట్లు పోగేసుకున్న గాలి జనార్ధన్ రెడ్డితో పరిశ్రమ పెట్టించాలనుకున్నారు. ఫ్యాక్టరీకి కావలసిన భూములే కాదు.. విమానాశ్రయం పేరుతో కూడా కొన్ని వేల ఎకరాలు గాలి జనార్ధన్ రెడ్డి కి కట్టపెట్టడంతో ” బ్రహ్మిణి ” పేరుతో ఉక్కుపరిశ్రను స్ధాపించి పనులు ప్రారంభించారు. ఆ తర్వాత వైఎస్ మరణం, గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ రాజ్యం కూలిపోవడతో.. పరిశ్రమ ఆగిపోయింది.
రాష్ట్ర విభజన తర్వాత విభజన చట్టంలో ఉన్న ” కడప ఉక్కు” కోసం చంద్రబాబు నాలుగున్నరేళ్లు ప్రయత్నించారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడూ.. లేనప్పుడూ కూడా కేంద్రం నుంచి “పరిశీలన” సమాధానమే వచ్చింది. ఎవరెన్ని ఉద్యమాలు చేసినా కేంద్రం మాత్రం స్పందించలేదు. చివరకు సిఎం రమేష్ ఆమరణదీక్ష విరమించే సమయంలో… కేంద్రం చేపట్టకపోతే.. తామే నిర్మిస్తామని సీఎం ప్రకటించారు. అన్నట్లుగా ఇప్పుడు శంకుస్థాపన చేస్తున్నారు. స్టీల్ ప్లాంటుకు కావలని కావలసిన నిధులు, ఖనిజ సంపద,నీటి సౌకర్యం తదితర అన్ని సౌకర్యాలు సర్వం సిద్దం చేసుకుంటున్నారు. జమ్మలమడుగు నియోజక వర్గంలోని మైలవరం మండలం కంబాలదిన్నె దగ్గర 2,700 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించి ఉక్కుపరిశ్రమ కు కేటాయించారు. ఉక్కుపరిశ్రమ స్ధాపనకు మొత్తం 20,000 వేల కోట్ల నిధులు కావాలని అంచనా వేశారు.
గతంలో విశాఖ ఇస్పాత్ నిగమ్ సిఎండి గా చేసి అనుభవం కలిగిన పి.మధుసూధన్ ను ఈ ఉక్కు పరిశ్రమకు సిఎం డి గా నియమించారు . ఈ ఉక్కు కార్పోరేషన్ ను స్పెషల్ పర్సన్ వెహికల్ గా ఏర్పాటు చేసి దీని మనుగడ కోసం రాష్ట్రప్రభుత్వం 2 వేల కోట్లు నిధులు మంజూరు చేయాలని నిర్ణయించింది . చంద్రబాబు ప్రత్యేక చొరవతో ఈ ” రాయల ఉక్కుపరిశ్రమ ” కు సర్వం సిద్దం చేసింది. ప్రైవేటు సంస్థలు ఈ ఉక్కు పరిశ్రమలో భాగం అయ్యేందుకు చర్చలు జరుపుతున్నాయని… ఎవరు మెరుగైన ఆఫర్ తో వస్తే వారితో భాగస్వామ్యం అవుతామని చంద్రబాబు అంటున్నారు. అయితే తమ వద్ద ఉన్న భారీ పరిశ్రమలను వదిలించుకోవడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తూంటే.. ఏపీ ప్రభుత్వం ఇంత పెద్ద ప్రాజెక్ట్ ను నెత్తికెత్తుకోవడం..ఓ సాహసంగా కనిపిస్తోంది.