ఇది మంత్రి నారాయణ గురించిన కబురు కాదు. సీపీఐ జాతీయ నాయకుడు (చికెన్) నారాయణ గురించిన కబురు. వామపక్షాలకు కీలకమైన నాయకుడుగా, ప్రజా ఉద్యమాలకు పోరాట యోధుడిగా పేరు గడించిన ఈ నారాయణ గతంలో ఎన్నడైనా జీవితం పట్ల విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారా? అంత దారుణమైన అనుభవాలు, జీవితాన్ని కడతేర్చుకోవాలని అనిపించేంత దుర్ఘటనలు ఆయనకు ఎప్పుడు, ఏం ఎదురయ్యాయి? …ఇవన్నీ ప్రశ్నలే! అయితే ఆయన తాజాగా ఓ ప్రెస్మీట్లో చెప్పిన మాటలను గమనిస్తే.. ఆయనకు గతంలో ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిన మాట మాత్రం వాస్తవం అని బోధపడుతుంది. అందుకు దారితీసిన కారణాలు మాత్రం అర్థం కావు.
సీపీఐ నారాయణ తాజాగా ఒక ప్రెస్మీట్లో గవర్నర్ల వ్యవస్థ మీద నిప్పులు చెరిగారు. అరుణాచలప్రదేశ్లో రాష్ట్రపతిపాలన పెట్టడంపై కత్తులు నూరిన నారాయణ పనిలో పనిగా కేంద్రంలోని మోడీ సర్కార్ వైఖరిని దుయ్యబడుతూ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ ఆత్మహత్యను కూడా తెరమీదకు తీసుకువచ్చారు. ‘ఆత్మహత్య చేసుకోవాలంటే అంత సులువు కాదు. దానికి ఎంతో ధైర్యం ఉండాలి. అది తనకు స్వీయ అనుభవం’ అని కూడా నారాయణ చెప్పారు.
అంటే గతంలో ఎన్నడో నారాయణ కూడా ఆత్మహత్య చేసుకోవాలని భావించి, ధైర్యం చాలక ఆగిపోయినట్లుగా అర్థమవుతోంది. అంతకుమించి.. తనకు ఎప్పుడు ఎందుకు ఆత్మహత్య మీద ప్రేరణ కలిగిందో నారాయణ మర్మం చెప్పలేదు.
అదంతా పక్కన పెడితే.. అమాయకంగా ఒక మాట జారిపోయి, తర్వాత నాలిక్కరుచుకోవడం, ఆ మాట అనుకోకుండా వివాదంగా మారితే.. దిద్దుకోవడానికి ప్రయత్నించడం నారాయణకు అలవాటే. చికెన్ నారాయణ అంటూ నిక్నేం రావడానికి కూడా ఇలాంటి నోటిజారుడే కారణం. కాగా, తాజాగా ‘ఆత్మహత్యకు ఎంతో ధైర్యం కావాలి’ అన్న మాట కూడా అదే మాదిరి వివాదంలా మారేలా ఉంది. ఇది రోహిత్ మరణం పట్ల బాధను వ్యక్తం చేసే కామెంట్లా కాకుండా, అభినందిస్తున్నట్లుగా ఉన్నదని కొందరు అప్పుడే తాటాకులు కట్టేస్తున్నారు మరి!