ఆంధ్రపదేశ్ ప్రభుత్వం కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయడంపై ఉత్తరప్రదేశ్ ఎంపీ జీవీఎల్ నరసింహారావు… మండిపడ్డారు. అతి ఉత్తిత్తి స్టీల్ ఫ్యాక్టరీ అని ఎద్దేవా చేశారు. కేంద్రం అడిగిన సమాచారన్ని ఏపీ ఇవ్వకపోవడం వల్లనే ఇంకా.. కేంద్రం స్టీల్ ఫ్యాక్టరీకి అనుకూలంగా నిర్ణయం తీసుకోలేదని ఆయన చెబుతున్నారు. ఈ మేరకు ఓ లేఖను ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. మెకాన్ సంస్థ నుంచి నివేదిక రాగానే… స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని.. ఏపీ ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని కేంద్రం చెప్పుకొచ్చింది. అయితే.. జీవీఎల్, కేంద్రం స్పందనపై.. ఏపీ ప్రభుత్వం మండి పడింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి సమాచారాన్ని పంపామని..గనులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చినా… సమాచారం పేరుతో తాత్సారం చేస్తున్నాని విమర్శించింది. మెకాన్ సంస్థకు పూర్తి సహకారం అందించడం వల్లే ప్రాథమిక నివేదిక ఇచ్చిందని. టాస్క్ ఫోర్స్ కమిటీ నివేదికను కేంద్రం ఎందుకు బయటపెట్టడం లేదని.. ఏపీ .. కేంద్రాన్ని ప్రశ్నించింది.
2018 జనవరి 4, 6 తేదీల్లో మెకాన్ సంస్థ క్షేత్రస్థాయి పర్యటనలో రాష్ట్రానికి వచ్చి సాధ్యాసాధ్యాలను పరిశీలించి కేంద్రాన్ని నివేదికను ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ఖనిజ నిల్వలు ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు తగినట్లుగానే ఉన్నాయని ఆ నివేదికలో ఉంది. అంతేకాకుండా అనంతపురం జిల్లాలో 110 మిలియన్ టన్నులు, ప్రకాశం జిల్లాలో మరో 50 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం ఏపీలో ఉన్నట్లుగా నివేదికలో తెలిపింది. ఇది ప్రాథమిక నివేదికేనని.. పూర్తి స్థాయి నివేదిక రావాల్సి ఉందని కేంద్రం కొత్తగా చెబుతోంది. నిజానికి సెయిల్, మెకాన్ వంటి సంస్థలు అందించిన నివేదికల మేరకు కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ఆర్థికంగా సాధ్యం కాదని సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
కడప జిల్లాలో 30 సంవత్సరాలకు సరిపడా ఇనుప ఖనిజం అందుబాటులో ఉంది. రైల్వే లైనుకు 20కి.మీ దూరంలో, విద్యుత్ గ్రిడ్ లైన్‌కు 7కి.మీల దూరంలో, గండికోట రిజర్వాయర్‌కు 10కిమీల దూరంలోనే ప్లాంట్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మెకాన్ సంస్థ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సానుకూలమైన నివేదిక ఇచ్చినప్పటికీ, టాస్క్‌ఫోర్స్ నివేదికను బయటపెట్టకుండా సెయిల్ ఇచ్చిన ప్రాథమిక నివేదికను మాత్రమే పరిగణనలోకి తీసుకుని పరిశ్రమ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది. ఇదే విషయాన్ని ప్రభుత్వం గుర్తు చేసింది. ఉక్కు పరిశ్రమ ప్రకటన కేవలం రాజకీయ నిర్ణయమేనని కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ అక్టోబర్ 13న వ్యాఖ్యానించారు. అయినప్పటికీ సమాచారం పేరుతో కేంద్రం ఏపీపైనే నిందలేస్తోంది.