ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం చేస్తోంది కాబట్టి.. అందులో కచ్చితంగా.. తప్పులు వెదకాల్సిందే అన్నట్లుగా ఉంది సాక్షి పత్రిక తీరు. జనవరి ఒకటో తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో హైకోర్టు భవనం పరిస్థితిపై ఓ కథనం రాసుకొచ్చారు. లోపల సౌకర్యాల గురించి చెప్పకుండా.. బయట ఎక్స్టీరియర్, పెయింట్లు, ఇతర పనుల కోసం కట్టిన కర్రలు, అలాగే… భవనానికి దూరంగా.. భవనం కనిపించేలా.. గోతులు ఉన్న రోడ్ల ఫోటోలు వేసి.. అసలు ఏపీ హైకోర్టు రెడీ కాలేదన్నట్లుగా కథనం ప్రచురించేసింది.
నిజానికి సాక్షి కథనం హెడ్ లైన్ ” తాత్కాలిక హైకోర్టు పనులన్నీ ఎక్కడివక్కడే..” అని పెట్టినప్పటికీ.. అసలు విషయంలో మాత్రం చాలా వేగంగా… పనులు చేశారని… పరోక్షంగా అంగీకరించారు. కేవలం తొమ్మిది అంటే.. తొమ్మిది నెలల కాలంలోనే హైకోర్టు నిర్మాణం జరిగిందని రాసుకొచ్చారు. 2.25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ ప్లస్ టు భవనాన్ని తొమ్మిది నెలల్లో పూర్తి చేశారు. ఈ విషయాన్ని సాదాసీదీగా చెప్పిన సాక్షి… లిఫ్టులు, ఎలక్ట్రికల్ పనులు పూర్తి కావడానికి ఆరు నెలలు పడుతుందని చెప్పుకొచ్చింది. ఓ భవన నిర్మాణ పని.. అనేది ఎంత మంది పని చేస్తున్నారనేదానిపై ఆధారపడి ఉంటుంది. కానీ పనులు జరగడం లేదని… హైకోర్టు సిద్ధం కాలేదని చెప్పేందుకు.. ఓ లెక్క వేసుకుని దాన్ని రాసేసుకుంది. ఎల్ అండ్ టీ సంస్థ కొన్ని వందల మందితో… మూడు షిప్టుల్లో ఇరవై నాలుగు గంటలు పని చేస్తూ.. లోపల ఇంటీరియర్ పనులు చేయిస్తోంది.
ఈ కథనం మొత్తంలో మరో విశేషం ఏమిటంటే.. హైకోర్టు రెడీ అయిందని చెప్పడం. కొన్ని కోర్టు హాళ్లను రెడీ చేసి ప్రభుత్వం ఇస్తుందట. అందులో కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చుట. అంటే ఏమిటి అర్థం… హైకోర్టు రెడీ అయినట్లేగా..? అయినా ఎక్కడివక్కడే పనులు అని చెప్పడం ఎందుకు..? మళ్లీ హైకోర్టు రెడీ అవుతోంది… అక్కడ్నుంచే కార్యకలాపాలు అని చెప్పడం ఎందుకు..? ప్రభుత్వాన్ని ప్రతి విషయంలోనూ గుడ్డిగా విమర్శించే విషయంలో.. సాక్షి .. తను గుడ్డిగా వ్యవహరిస్తోందని ఈ కథనంతో తేలిపోయింది.