హీరోల్ని అభిమానులకు నచ్చేలా చూపించడం ఎలానో బోయపాటి కి బాగా తెలుసు. ఏ హీరోతో పనిచేస్తే ఆ హీరోకి అభిమానిలా మారిపోతారాయన. బోయపాటి సక్సెస్ సీక్రెట్ అదే కావొచ్చు. అందుకే `మిగిలిన హీరోలంతా.. తమ కెరీర్లో ఒక్కసారైనా బోయపాటితో పనిచేయాలి` అంటూ.. సలహా ఇస్తున్నాడు రామ్ చరణ్. ఇన్ని సినిమాలకు పనిచేశా గానీ, సెట్లో టీమ్‌ని ఆయనంత క్రమశిక్షణతో ఎవరూ ఉంచలేదని కితాబు అందించాడు చరణ్.
‘‘నాలుగేళ్ల క్రితమే ఈ చిత్రం కథ విన్నా. ఆయన ఒక లైన్ చెప్పారు. వెంటనే సినిమా తీసేస్తారేమో అనుకున్నా. ఆయన ఆలోచనలు వేరేలా ఉన్నాయి. బోయపాటి బ్రాండ్ అందరికీ తెలిసిందే. అబద్దాన్ని కూడా నిజంలా నమ్మిస్తారాయన. నాలుగేళ్లు ఎంతో కష్టపడి, ఆలోచించి అభిమానులకు నచ్చేలా చరణ్‌తో ఓ మంచి సినిమా తీయాలని కష్టపడి తయారుచేసిన చిత్రమిది. ఆయనతో పనిచేస్తే ఆ కిక్కే వేరప్పా. నేను కొత్త అవతారంలో కన్పిస్తానా లేదా? అనేది చిత్రంలో చూడండి. కానీ హిట్టు కొట్టినప్పుడు కలిగే ఆనందం.. ఆయన సెట్లో కనిపించేది. ఆయన్ని కలిసి ఇంటికెళ్తే.. ‘బోయపాటి గారిని కలిసి వస్తున్నావా’ అని ఇంట్లో వాళ్లు సులభంగా గుర్తించేవారు. ఆయన్ని కలిస్తే నాకు ఏదో తెలియని శక్తి వస్తుంది. ఈ చిత్రం నాకు మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుందన్న నమ్మకం ఉంది” అన్నాడు చరణ్.