నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనపై బీజేపీ నేతలు చాలా ముందుగానే టెన్షన్ పడుతున్న వాతావరణం కనిపిస్తోంది. వస్తోంది ప్రధానమంత్రి కాబట్టి.. రాష్ట్రం నలుమూలల నుంచి.. ఓ మాదిరి నేతలు అయినా.. తలా వంద మందిని సభకు తీసుకొచ్చినా… ఎలాగోలా… బండి నడిపించేయవచ్చు. జనసమీకరణ… లక్షల్లో ఉండాల్సిన పని లేదు. అంత అశ కూడా పెట్టుకోవాల్సిన పని లేదు. ఓ పదివేల మందిని సమీకరిస్తే… అదే గొప్ప విషయం. ఆ విషయంలో.. బీజేపీ నేతలకు టెన్షన్ లేదు కానీ… తెలుగుదేశం పార్టీతో పాటు..ఇతర పక్షాలు పిలుపునిచ్చిన నిరసనల విషయంలో మాత్రం టెన్షన్ పడుతున్నారు.
ఒకటో తేదీ నుంచే.. అటు తెలుగుదేశం పార్టీ.. ఇటు వామపక్షాలు, విద్యార్థి, ప్రజాసంఘాలు… ఏపీ వ్యాప్తంగా మోడీ పర్యటనకు వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభించాలని నిర్ణయించాయి. గతంలో.. నరేంద్రమోడీ.. చెన్నై వెళ్లినప్పుడు.. తమిళనాడు ప్రజలు ఎలా నిరసన తెలిపారో.. అంతకు మించి నిరసన తెలిపి.. జాతీయస్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించాలనుకుటున్నారు. అయితే.. అది మోడీ ఏపీకి వస్తేనే సాధ్యం కాబట్టి.. ఎక్కడా మోడీ పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించడం లేదు. నేరుగా చెప్పకపోయినా… కేంద్రంపై తమ నిరసన వ్యక్తం చేయడానికి మోడీ టూర్‌ను ఓ గొప్ప అవకాశం మలుచుకోవాలనే ప్రయత్నంలో.. అటు టీడీపీతో పాటు ఇతర పార్టీలు, ప్రజాసంఘాలు ఉన్నాయి. అదే బీజేపీ నేతలకు టెన్షన్ ప్రారంభమయింది.
అందుకే రివర్స్ యాంగిల్‌లో విమర్శలు ప్రారంభించారు. అటు మాజీ మంత్రి మాణిక్యాలరావు, ఇటు ఎమ్మెల్సీ మాధవ్‌లు.. మోడీ పర్యటనను అడ్డుకుంటే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరికలు పంపుతున్నారు.. మోడీ పర్యటనను టీడీపీ అడ్డుకుంటే.. తాము చంద్రబాబు టూర్‌లను అడ్డుకుంటామనే వార్నింగ్ కూడా ఇస్తున్నారు. చూడబోతూంటే.. బీజేపీ నేతలు కూడా.. నిరసన ప్రదర్శలను సాకుగా చూపి… ప్రధాని.. ఇక్కడికి వచ్చే పరిస్థితులు లేవని.. చివరికి టూర్‌ని క్యాన్సిల్ చేసుకునేలా… హైకమాండ్‌కు నచ్చ చెబుతారేమోనన్న సందేహం… ఇతర పార్టీల్లో ప్రారంభమయింది. బీజేపీ నేతల హడావుడి అలాగే.. ఉంది మరి..!