త్వరలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారనుకొన్న పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ, తన తండ్రి స్వర్గీయ ముఫ్తీ మొహమ్మద్ కి కేటాయించబడిన అధికార నివాసాన్ని ఖాళీ చేసి నాలుగు రోజుల క్రితం శ్రీనగర్ లోని తమ ఫెయిర్ వ్యూ బంగ్లాలోకి మారిపోయారు. ఆమె ముఖ్యమంత్రి అయ్యేందుకు బీజేపీ అంగీకరించినప్పటికీ, ఇంతవరకు ఆమె ప్రభుత్వ ఏర్పాటుకి చొరవ చూపలేదు. ఇప్పుడు అకస్మాత్తుగా ఆమె అధికార నివాసాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవడంతో ఆమెకు బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంలేదని చాటి చెప్పినట్లయింది.
దీనిపై బీజేపీ నేతలు ఎవరూ ఇంతవరకు ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా సంయమనం పాటిస్తున్నారు. రెండు వారాల క్రితమే ఆమె ప్రభుత్వం ఏర్పాటు చేయవలసి ఉన్నప్పటికీ ఆమె అందుకు చొరవ చూపకపోవడంతో రాష్ట్రంలో తాత్కాలికంగా గవర్నర్ పాలన విధించారు. ఇప్పటికీ ఆమె సానుకూలంగా స్పందించకపోగా అధికార నివాసం ఖాళీ చేసి బీజేపీకి వ్యతిరేక సంకేతాలు పంపించారు.
“బీజేపీ-పిడిపిలు ఆరేళ్ళపాటు పొత్తులు కొనసాగించాలని ఇదివరకు నిర్ణయం జరిగింది. దానికి మేము నేటికీ కట్టుబడే ఉన్నాము. ముఫ్తీ మహామ్మద్ సాబ్ మృతి కారణంగా మేము ఎటువంటి పునరాలోచనలు చేయడం లేదు,” అని సీనియర్ బీజేపీ నేత, జమ్మూ కాశ్మీర్ మాజీ ఉపముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ తెలిపారు.
ఫిబ్రవరి మొదటి వారంలో ఆమె ప్రధాని నరేంద్ర మోడితో సమావేశామవ్వాలనుకొంటున్నట్లు పిడిపి నేతలు చెపుతున్నారు. ఒకవేళ ఆమె ఇంకా జాప్యం చేసినట్లయితే, బీజేపీ కూడా మళ్ళీ పావులు కదపడం ప్రారంభించవచ్చును. ప్రస్తుతానికి పిడిపి నుండి వస్తున్న ఇటువంటి సంకేతాలు బీజేపీకి ఏమాత్రం సానుకూలంగా కనబడటం లేదనే చెప్పవచ్చును.