ప్రభోధానంద అనే స్వామిజీ ఆశ్రమం విషయంలో.. పోలీసులపై జేసీ దివాకర్ రెడ్డి చేసిన విమర్శలకు ఓ సీఐ గట్టిగా విరుచుకపడ్డారు గుర్తుందా..? అనంతపురం జిల్లా పోలీసు అధికారుల సంఘం పేరుతో గోరంట్ల మాధవ్ ఆ సీఐ జేసీని నాలుక కోస్తా అంటూ.. ఇష్టం వచ్చినట్లు .. అచ్చంగా రాజకీయ నేతగానే మాట్లాడిన తీరు చూసి… ఏదో విశేషం ఉందే అని చాలా మంది అనుకున్నారు. ఆ విశేషం ఇప్పుడు బయటపడుతోంది. ఆయన… తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. వైసీపీలో చేరబోతున్నారు. ప్రస్తుతం కదిరి అర్బన్ సీఐగా ఉన్న గోరంట్ల మాధవ్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను కదిరి డీఎస్పీ శ్రీలక్ష్మి గారికి అందజేశారు. డిఎస్పీ ఆలేఖ ను జిల్లా ఎస్పీ ఙీవీజీ అశోక్ కుమార్ కు పంపారు. రాజీనామా ఆమోదించండం లాంఛనమే కావొచ్చు.
ఇప్పటికే ఆయన వైసీపీ వర్గాలతోనూ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనూ సమావేశమై తన భవిష్యత్ విషయంలో క్లారిటీ తీసుకున్నారట. అనంతపురం జిల్లాలోని హిందూపురం లోక్‌సభ టిక్కెట్ ఇస్తామని.. వైఎస్ జగన్ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ మేరకే ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేశారని.. చెబుతున్నారు. జేసీ దివాకర్ రెడ్డిపై… సీఐ మాధవ్ విరుచుకుపడిన విదానం జగన్‌కు బాగా నచ్చిందని.. అందుకే.. ఆయనను.. పార్టీలోకి తీసుకుని పెద్ద పీట వేస్తున్నారని చెబుతున్నారు. హిందూపురం పార్లమెంట్ స్థానానికి ప్రస్తుతం నదీమ్ అనే నేత ఇన్చార్జ్ గా ఉన్నారు. ఆయన బలమైన నేత కాదని… గోరంట్ల మాధవ్‌ను… రంగంలోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ప్రబోధానంద ఆశ్రమం దగ్గర.. జేసీ పోలీసులపై చేసిన వ్యాఖ్యలను ఆధారంగా చేసుకునే.. మొత్తం ఓ పద్దతిగా నడిపారేమోనన్న అభిప్రాయం కూడా.. రాజకీయవర్గాల్లో వస్తోంది.
ఎందుకంటే.. పోలీసులపై జేసీ నోటి మాటల ద్వారానే విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి… విశాఖ విమానాశ్రయంలో నేరుగా.. పోలీస్ కమిషనర్‌పైనే విరుచుకుపడ్డారు. విజయసాయిరెడ్డి పోలీసు అధికారుల్ని రెండు చేతులు పెట్టి తోసేశారు. ఇలాంటివి చాలా జరిగాయి. అయినా… పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. జేసీపై విరుచుకుపడి నేరుగా వెళ్లి వైసీపీలో చేరడం ఏమిటో.. చాలా మందికి అర్థం కావడం లేదు. రాజకీయం వంట పడితే అంతే ఉంటుందమో..?