ప్రధానమంత్రి నరేంద్రమోడీకి.. ఏపీ పర్యటనకు రావాల్సిన ఆరో తేదీనే.. ఆకస్మిక కార్యక్రమాలు ఏర్పడ్డాయా..? అంత ఆకస్మిక కార్యక్రమాలు కేరళకు వెళ్లడానికి అడ్డం పడలేదా..?. జన సమీకరణ కష్టం అయ్యే పరిస్థితులు ఏర్పడటం.. నిరసనలు జరిగితే పరువు పోతుందనే భయంతోనే.. మోడీ టూర్ వాయిదా పడిందనే విషయంపై … మాత్రం ప్రజలకు క్లారిటీ ఉంది. కేంద్ర నిఘా వర్గాలు కూడా అదే చెప్పాయి.
బ్లాక్ బెలూన్స్ పరువు తీస్తాయని భయపడ్డారా..?
కొద్ది రోజుల కిందట.. ప్రధాని నరేంద్రమోడీ.. తమిళనాడు పర్యటనకు వెళ్లారు. అక్కడి ప్రజలు వ్యక్తం చేసిన నిరసన దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఆయన రోడ్డు మార్గం ద్వారా ఎక్కడా పర్యటించపోయినా.. మోడీ వెళ్లే ఆకాశమార్గంలో…. హెలికాఫ్టర్‌కు కూడా దారి లేకుండా… నల్ల బెలూన్లు గాలిలోకి వదిలారు. ఇప్పుడు ఆయన ఏపీకి రావాలని అనుకున్నారు.. ఆ తమిళనాడు స్ఫూర్తిగా నిరసనలకు … పార్టీలు, ప్రజాసంఘాలు సిద్ధమయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. అందుకే మోడీ పర్యటనకు వెళ్లకపోవడమే మంచిదని సూచించాయని ప్రచారం జరుగుతోంది. జనవరి ఆరో తేదీన కేరళలో ఉదయం బహిరంగ సబలో మాట్లాడిన అనంతరం ప్రధాని ఏపికి వచ్చి బహిరంగసభలో పాల్గొనాల్సి ఉంది. అయితే మోడీ టూర్‌పై … పది రోజుల ముందే ఓ రేంజ్లో నిరసనలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో నిరసనలు పెల్లుబుకుతున్న తరుణంలో రావడం మంచిది కాదని కేంద్ర నిఘా వర్గాలు సూచించినట్లు తెలుస్తోంది.
విభజన హామీల్లో ఏమిచ్చారని చెప్పుకుంటారు..?
అదే సమయంలో.. ఏపీ బీజేపీ నేతల మధ్య సఖ్యత లేకపోవడం కూడా.. బహిరంగసభ వాయిదాకు కారణమని చెబుతున్నారు. ఓ వర్గం నేతలు.. విభజన హామీల్లో కొన్నింటినైనా అమలు చేసిన తర్వాత ఏపీకి రావాలని… పీఏంవోకి సమాచారం ఇచ్చారు. విశాఖ రైల్వే జోన్, దుగరాజపట్నం పోర్ట్ లేదా గిరిజన విశ్వవిద్యాలయం పై ప్రకటన చేస్తే బాగుంటుందని నేరుగా పీఎంవోకే .. లేఖ రాసినట్లు చెబుతున్నారు. కన్నా ఆధ్వర్యంలో బహిరంగసభ జరగడం లేదని కొంత మంది నేతలే.. ఇలా ఫిర్యాదులతో కూడిన సలహాలు పంపారని చెబుతున్నారు. వేల కోట్ల రూపాయలు ఇచ్చామని చెబితే ప్రజలు నమ్మరని కూడా వారు ప్రధాని కార్యాలయానికి వివరించారని తెలిసింది.
సభ వాయిదాతో మోడీ పరువు నిలబడిందా..? పోయిందా.. ?
ప్రధాని మోదీ పర్యటనకు ఏర్పాట్లు కూడా చేసుకున్న సమయంలో పర్యటన వాయిదా కమలనాధులు ఆశలపై నీళ్లు చల్లింది. మోదీ పర్యటన రద్దు వెనుక బలమైన కారణాలే ఉన్నాయి. కేరళ నుంచి ఏపికి రావాల్సిన మోదీ కేరళలో వేదిక మారడంతో సాయంత్రానికి ఏపికి రావడం కష్టమవుతుందనే ఉద్దేశ్యంతోనే పర్యటన వాయిదా వేశారని చెబుతున్నప్పటికీ అసలు విషయం మాత్రం.. నిఘా వర్గాల నివేదికలు.. బీజేపీలో గ్రూపుల గొడవలు. ఏదో ఒక వరం ప్రకటించకుండా ఏపికి వస్తే నిరసన తప్పదని కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకే వాయిదా పడిందని ఏపి ప్రభుత్వం కూడా భావిస్తోంది. మొత్తానికి మోడీ టూర్‌కి వస్తే పరువు పోతుందన్న భయంతోనే బహిరంగసభ వాయిదా వేసుకున్నారు. కానీ ఆకస్మిక పర్యటనల వల్ల కాదు.
— సుభాష్